భగవద్గీత గురించి

గీతా సారాంశం

భగవద్గీత అందరూ అనుకున్నట్టు హిందూ మతానికి మాత్రమే చెందిన గ్రంథము కాదు. అది లోకైక మత గ్రంథము. సమస్తమానవాళి అనుసరించ వలసిన నియమములు గురించి చెప్పిన మహత్ గ్రంథము. సర్వకాలములయందు, సర్వఅవస్థలయందు సకల ప్రాంతముల యందు ఆచరించవలసిన నియమ నిబంధనల గురించి బోధించిన అమూల్య గ్రంథము. భగవద్గీత ఏ ఒక్క దేశానికో, ప్రాంతానికో పరిమితం కాదు. మానవాళి అందరూ ఆచరించవలసిన నియమావళి. అటువంటి గ్రంథరాజము మన భారత దేశమునకు చెందినది కావడం మన అదృష్టం. ఎడ్విన్ ఆర్నాల్డు అనే పాశ్చాత్య పండితుడు గీతపట్ల ఆకర్షితులై దానిని ఆంగ్లంలోకి అనువదించాడు.

చక్కని పుష్పమాలవలె, లేక మనోహర కుసుమ సముదాయమువలె క్రమపద్ధతిని సుందరముగ కూర్చబడిన ధర్మములయొక్క సముదాయమే గీత.

గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీంద్రులు అక్షరబద్ధం చేసి మనకు అందించారు. గీతలు ఎన్నో ఉన్నాయి. అష్టావక్రగీత, అవధూతగీత, ఋభుగీత, వసిష్టగీత, హనుమద్గీత, శివగీత, హంసగీత, కపిలగీత ఇంకా ఎన్నో గీతలు ఉన్నాయి. కానీ భగవద్గీతకు ఉన్న ప్రాశస్త్యము ఆ గీతాలకు లేదు. గీత ఉపనిషత్తుల సారము. ఉపనిషత్తులు ఆధ్యాత్మిక వాఙ్మయములో విశిష్ట స్థానమును సంపాదించుకొన్నారు. వేదములు అనే చెట్టుకు కాచిన ఫలములే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల సారమును తెలుసుకొనవలెనని ప్రతి ముముక్షువు కోరుకుంటాడు. కాని ఉపనిషత్తుల సారమును తెలుసుకొనవలెనని ప్రతి ముముక్షువు కోరుకుంటాడు. కాని ఉపనిషత్తులను చదవడం అర్ధంచేసుకోవడం చాలా కష్టము. ఈ ఉపనిషత్తులు సారమంతటినీ భగవద్గీతలో నింపి మనకు అందించాడు వ్యాసుడు. ఉపనిషత్తులు గోవులు అయితే అర్జునుడు ఆవు దూడ. గోపాలుడు అయిన శ్రీకృష్ణుడు ఆవుపాలు అనే గీతను పిదికి మనకు అందించాడు. అందుకే గీతామృతము అని అన్నారు.
ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఈ మూడు ప్రస్థాన త్రయము అని అంటారు. భగవద్గీతలో ఎన్నో ఆధ్యాత్మిక విషయములు, ధర్మసూక్ష్మములు ఇమిడి ఉన్నందున ఇది ప్రస్థాన త్రయములో ఒకటిగా వెలుగుతూ ఉంది. ఈ గీత ద్వాపర యుగాంతంలో అంటే కలియుగ ప్రారంభం కాక ముందు చెప్పబడింది. కలియుగంలో ధర్మము క్షీణిస్తుందనీ, ఒంటి పాదంతో నడుస్తుందనీ తెలిపి, రాబోవు కలియుగంలో మానవులను ఉద్ధరించడానికి భగవానుడు గీతను అర్జునుడికి ఉపదేశించాడు. లేకపోతే ఎన్నో అవతారములను ఎత్తిన పరమాత్మ గీతను, కృతయుగంలోనో, త్రేతాయుగంలోనో లేక ద్వాపరయుగం మధ్యలోనో ఉపదేశించి ఉండేవాడు. అలాచేయకుండా మానవాళిని ఉద్ధరించడానికి గాను కలియుగ ప్రారంభంలో గీతామృతమును లోకానికి అందించాడు పరమాత్మ. కలియుగంలో మానవులకు కలగబోయే శోకమును అంతమొందించడానికి గీత ఎంతగానో ఉపయోగపడుతుంది. గీతను ఎవరెవరు చదవాలి అనే సందేహము వచ్చినపుడు, ఈ సంసార సాగరంలో ఈదులాడుతున్న ప్రతివారు చదువ తగినది గీత అని చెప్పవచ్చును. సంసార సాగరంలో మునిగిపోతున్న మానవులకు గీత ఒక నావలాగా ఉపయోగపడి వారిని ఒడ్డుకు చేరుస్తుంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం మనకు ఎన్నో సౌకర్యాలు కలిగించింది. సుఖంగా జీవనం గడపడానికి ఎన్నో వసతులు చేకూర్చింది. వేగంగా ప్రయాణం చేయడానికి, సుఖంగా ప్రయాణం చేయడానికి సాధనాలు సమకూర్చింది. ఇన్ని సుఖాలు, భోగభాగ్యాలు ఉన్నా మానవుడు నిరంతరం ఏదో వెలితితో బాధపడుతున్నాడు. ఉన్నది చాలదు, ఈ సుఖం కాదు, ఇంకా ఏదో కావాలి అనే మోహంలో పడుతున్నాడు. తన మనస్సు అల్లకల్లోలం చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఎంతో ధనం, హోదా, భోగభాగ్యాలు ఉన్నా మానసిక శాంతి లేక, ప్రశాంతత లేక ఎంతోమంది బాధపడుతున్నారు. దానికి కారణం వారి అవిద్య. ఈ అవిద్య పోవాలంటే ఉపనిషత్తుల సారం అయిన భగవద్గీతను అధ్యయనం చేయడం ఒకటే మార్గం. మరొక మార్గం లేదు.

మీలో సంస్కృతము తెలిసినవారు రేపు లేక వీలైనచో ఈ దినమే ఒక గీతాపుస్తకమును కొని చదువ ప్రారంభించండి. మీలో సంస్కృతము తెలియనివారు కనీసము గీత కొరకైనను సంస్కృతము నేర్చుకోండి. నేను యధార్ధముగా చెప్పుచున్నాను. మీరు కని విని ఎరుగని అమూల్య జ్ఞానభండార మెంతయో గీతయందు కలదు.

ఈ లోకంలో కేవలం అధ్యయనం చేయడమే కాదు, దానిని ఆచరించాలి అని అందరూ తెలుసుకోవాలి. చిత్తములో రజోగుణము, తమోగుణము పెరుకోమిపోయి ఉంటే, ఎన్ని పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాలు చేసినా ప్రయోజనము లేదు. ముందు చిత్తములోని రజో, తమో గుణములను నాశనము చేసి సత్వగుణ ప్రధానం చేసుకోవాలి. తరువాత దాన్నికూడా వదిలిపెట్టి పరమాత్మ తత్త్వము అయిన నిర్గుణత్వాన్ని అలవరచుకోవాలి అని బోధిస్తుంది గీత.
కేవలము భగవంతుని మీద భక్తి ఉంటే చాలదు. సాటి మానవుల మీద, సాటి ప్రాణుల మీద జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి అని బోధిస్తుంది గీత. అన్ని ప్రాణులలో పరమాత్మ ఆత్మ స్వరూపుడుగా ఉన్నాడు. సాటి మానవులను ద్వేషిస్తే, సాటి ప్రాణులను హింసిస్తే, అది పరమాత్మను ద్వేషించినట్టు, హింసించినట్టు అవుతుంది అని నొక్కి చెప్పింది గీత. మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. అప్పుడే లోపల ఉన్న ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అని గీతాబోధ. ద్వంద్వముల యందు సమాన దృష్టి కలిగి ఉండాలి. సుఖ దుఃఖములను జయాపజయములను, లాభనష్టములను సమంగా చూడగలిగి ఉండాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిర్మలంగా ఉంటుంది. మానవులలో ఉన్న అహంకారము, భేదభావము అన్ని అనర్థములకు మూలము. సమత్వమే ప్రశాంతతకు మూలము అని బోధిస్తుంది గీత.
ఈ విశ్వమంతా భగవంతుని స్వరూపము. పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. అన్ని ప్రాణులలో ఆత్మస్వరూపుడుగా చైతన్యస్వరూపుడుగా వెలుగుతున్నాడు. ఆ సత్యం తెలుసుకోలేని మానవుడు సాటి మానవుల మధ్య భేదభావము కల్పిస్తున్నాడు. రాగద్వేషములతో సతమతమౌతున్నాడు. అదే అజ్ఞానము. ఆ అజ్ఞానమే అన్ని దుఃఖములకు మూలము. ఈ సత్యాన్ని బోధించినదే గీత.
మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము = 18

భగవద్గీత మరియు పర్వాలు

భగవద్గీత మహాభారత ఇతిహాసములో భీష్మ పర్వములో 25వ అధ్యాయము నుండి 42వ అధ్యాయము వరకు చెప్పబడింది. మహాభారతము 18 పర్వములు. భగవద్గీతలో ఉన్నవి 18 అధ్యాయములు. మహాభారత యుద్ధము జరిగినది 18 రోజులు. అందులో పాల్గొన్న సైన్యము 18 అక్షౌహిణీలు.

ఒక అక్షౌహిణి అంటే

భగవద్గీతలోని శ్లోకాలు 700

భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఎప్పుడు, ఏ సందర్భంలో, ఎక్కడ, ఏ సమయంలో, ఏమి ఆశించి చెప్పాడో తెలుసుకుందాము

ధర్మానికి ప్రతిరూపం అయిన ధర్మరాజుకు చెప్పలేదు. పితామహుడు భీష్ముడికి చెప్పలేదు. నీతికోవిదుడు విదురుడికి చెప్పలేదు. కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పాడు. అదీ యుద్ధం ఇంకాసేపట్లో జరగబోతుంది అనగా చెప్పాడు. అర్జునుడి మనసు సంఘర్షణలతో క్షుభితం అయినపుడు చెప్పాడు. తాను యుద్ధం చేయను అనే నిర్వేదం ఆర్జునుడిని ఆవహించినపుడు చెప్పాడు. “నాకు ఏమీ తోచడం లేదు. ఏ నిర్ణయమూ తీసుకునే శక్తి నాకు లేదు. నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు కర్తవ్యం ఉపదేశించు” అని అర్జునుడు పూర్తి శరణాగతి అయిన తరువాత చెప్పాడు. “నానుశోచంతి” అనే పదంతో మొదలుపెట్టి “మాశుచః” అనే పదంతో పూర్తిచేసాడు. అంటే ఎడవవద్దు అని అర్జునుడి కన్నీళ్లు తుడిచాడు.

విశ్వవాఙ్మయంలో భగవద్గీతను పోలిన గొప్ప గ్రంథము మరొకటి లేదు.

మనలో కూడా అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణే భారతయుద్ధం. మంచి – పాండవులు అయితే చెడు – కౌరవులు. మనలో సంఘర్షణ తలెత్తినపుడు నివారణోపాయము చూపేది భగవద్గీత. మన కన్నీళ్లు తుడిచి ఏడవకు, దైర్యంగా ఉండు అని వీపుతట్టి ప్రోత్సహించేది భగవద్గీత. భగవద్గీత పూజలో పెట్టుకొని పూజించే గ్రంధం కాదు. భగవద్గీత చదివితే పుణ్యం వస్తుందనీ, స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయనీ, సరాసరి మోక్షం వస్తుందనీ చదవకూడదు. భగవద్గీత కేవలం మోక్షానికి మార్గం చూపుతుంది. ఆ మార్గంలో నడవాల్సింది మనం. అందుకని విద్యార్థి దశ నుండి భగవద్గీతను పాఠశాలలో అంశంగా పరిగణించాలి. ప్రతి విద్యార్ధీ ఒక పాఠ్యాంశంగా చేర్చి బోధించతగ్గది భగవద్గీత. ప్రతి వాడిలో ధైర్యాన్ని, సైర్థ్యాన్ని నింపి వెన్నుతట్టి నిలబెట్టేది, ప్రోత్సహించేది భగవద్గీత.

ఇప్పుడు మనం భగవద్గీత పూర్వాపరాలు పరిశీలిద్దాం

భరతవంశములో ధృతరాష్ట్రుడు, పాండురాజు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారు హస్తినాపురానికి అధిపతులు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. ఆయన భార్య గాంధారి. పాండురాజు వీరుడు. అందుకే పాండురాజు హస్తినకు రాజయ్యాడు. పాండురాజుకు ఇద్దరు భార్యలు, కుంతీ, మాద్రి. పాండురాజు శాపవశాత్తు భార్యాసంగమానికి దూరం అయ్యాడు. భార్యలతో సహా అడవులకు వెళ్లాడు. దుర్వాసుని మంత్రప్రభావంతో కుంతికి యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు అనే పుత్రులు, మాద్రికి నకుల సహదేవులు అనే కుమారులు కలిగారు. హస్తినలో గాంధారికి సుయోధనుడు, దుశ్శాసనుడు సహా నూర్గురు కుమారులు కలిగారు.
పాండవులు సత్వగుణ సంపన్నులు. సహనశీలురు. ధర్మపరులు. నలుగురు తమ్ములు అన్నమాట జవదాటరు. తల్లిమాటకు కట్టుబడి వారు ఐదుగురు పాంచాల రాజకుమారి ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. దుర్యోధన, దుశ్శాసనులు మొదలగు కౌరవులు మొదటి నుండి తమ దాయాదులు పాండవుల మీద ద్వేషం పెంచుకున్నారు. దుర్యోధనుడు పరమలోభి, ఎదుటి వారి ఉన్నతిని చూచి సహించలేడు. అసూయ, ద్వేషము, దురభిమానము, గర్వము అతని సహజ లక్షణములు. తమ మాటే చెల్లాలనే తత్వం. అంతా నాకే కావాలనే దురాశ. సహజంగానే దాయాదుల మధ్య రాజ్యాధిపత్యం కోసం పోరు మొదలయింది. రాజ్యవిభజన జరిగింది. పాండవులకు ఎందుకూ పనికిరాని ఖాండవప్రస్థం ఇచ్చారు. వారు దానిని ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. రాజసూయ యాగం చేసారు. ధర్మరాజు చక్రవర్తి అయ్యారు. అది చూచి ఓర్వలేకపోయాడు సుయోధనుడు. వారి రాజ్యం ఎలాగైనా కాజేయాలని అనుకున్నారు. దానికి తన మేనమామ, కుటిలుడు, అయిన శకుని సాయం తీసుకున్నారు. ద్యూత క్రీడకు పాండవులను ఆహ్వానించాడు. ఓడించాడు, అవమానించాడు, వారినే కాదు వారి భార్య ద్రౌపదిని కూడా నిండు సభలో అవమానించాడు. రాజ్యం అపహరించి అడవులకు పంపించాడు.

ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు సాటిరాగల గ్రంథము మరొకటి లేదు అని అన్నారు బాలగంగాధర తిలక్. సంసార సాగరమును దాటడానికి ఒక నావ వంటిది భగవద్గీత.

అరణ్యవాసానంతరము పాండవులు తిరిగివచ్చు తమ రాజ్యం తమకు ఇమ్మని అడిగారు. ద్రుపద పురోహితుని, శ్రీకృష్ణుని, రాయబారం పంపారు. ఎవరి వాదన వారిది. చేతనైతే యుద్ధం చేసి తీసుకోండి కానీ సూదిమొన మోపినంత కూడా ఇవ్వను అని ఖరాఖండిగా చెప్పాడు దుర్యోధనుడు. ఆ విధముగా యుద్ధం అనివార్యం అయింది. శ్రీకృష్ణుని సేనలు దుర్యోధనుడికి, శ్రీకృష్ణుడు అర్జునుడికి దక్కారు. అర్జునుడికి సారధిగా ఉండటానికి అంగీకరించాడు శ్రీకృష్ణుడు.
లోకంలో ఉన్న రాజులంతా రెండు పక్షాలుగా విడిపోయారు. పాండవులు వారి మిత్రపక్ష రాజుల సైన్యం ఏడు అక్షౌహిణీలు అయితే, కౌరవులు వారి మిత్రరాజుల సైన్యం పదకొండు అక్షౌహిణీలు. కురుపాండవులకు యుద్ధం జరగబోతోంది అని తెలిసి వ్యాసుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు. యుద్ధం చూస్తావా, దివ్యదృష్టి ఇస్తాను అని అడిగాడు వ్యాసుడు. ఇక్కడ మరొక చిక్కుకూడా ఉంది. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. అతను తన కుమారులనే గుర్తుపట్టలేడు. ఇంక పాండుకుమారులను ఎలా గుర్తు పట్టగలడు. ఎవరు ఎవరిని చంపుతున్నారో తెలియదు. కాబట్టి ధృతరాష్ట్రునికి దివ్యదృష్టి ఇచ్చినా ప్రయోజనం లేదు. ఈ విషయం దాచి పెట్టి, అన్నదమ్ములపోరు, వారి చావులు చూచి తట్టుకోలేను అన్నాడు ధృతరాష్ట్రుడు. యుద్ధ విశేషాలు చెబితే వినాలని ఉంది అని అన్నాడు. వ్యాసుడు ఆ పనికి సంజయుని నియమించాడు. సంజయునికి ఇతరుల మనసులలోకి దూరి వారి మనోభావాలు తెలుసుకునే శక్తి, ఎక్కడైనా మనోవేగంతో పోయే శక్తి, యుద్ధరంగంలో తిరుగుతున్నా ఎటువంటి అస్త్ర శస్త్రములు తగలకుండా ఉండే శక్తిని ప్రసాదించాడు. యుద్ధం అంతా చూచి వచ్చి ధృతరాష్ట్రునికి చెప్పమని ఆదేశించాడు. సంజయుడు శిరసావహించాడు.
సంజయుడు వెంటనే యుద్ధభూమికి వెళ్ళాడు. పది రోజుల యుద్ధం చూచాడు. భీష్ముడు అంపశయ్యమీద పడి పోయాడు. ఆ విషయం చెబుదామని వ్యాసుడు ఇచ్చిన శక్తితో యుద్ధభూమి నుండి క్షణంలో హస్తినకు వచ్చాడు. ధృతరాష్ట్రునికి భీష్ముని అంపశయ్య గురించి చెప్పాడు. పెదతండ్రి పతనం వార్త విన్న ధృతరాష్ట్రుడు మూర్చపోయాడు. తేరుకున్నాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు. ఆ అడగడంతోనే భగవద్గీత ప్రారంభం అవుతుంది. ధృతరాష్ట్రుని ప్రశ్న గీతలో మొట్టమొదటి శ్లోకం.
మనం అంతా కూడా గుడ్డివాళ్ళమే. అజ్ఞానం అనే అంధకారంలో పడి గుడ్డివాళ్ల మాదిరి కొట్టుకుంటున్నాము. ఏం జరిగింది, ఏం జరగుతుంది, మనం ఇలా ఎందుకు ఉన్నాము మనకు మనమే ప్రశ్నించుకోవాలి. అప్పుడే మనకు గీత చదవాలని, వినాలని జిజ్ఞాస కలుగుతుంది. గీతను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తే, అర్జునుడితో పాటు విన్న సంజయుడు, ధృతరాష్ట్రుడికి తాను విన్న గీతను పూసగుచ్చినట్టు చెప్పాడు. మనం అందరం కూడా సంజయుడి లాంటి గురువు వద్దనుండి గీతామృతాన్ని వీనులవిందుగా పానం చేద్దాం. ఇంక భగవద్గీతలోకి ప్రవేశిద్దాము.
Scroll to Top