భగవద్గీత - మోక్షసన్యాస యోగము - పద్దెనిమిదవ అధ్యాయము

మోక్షసన్యాస యోగమునందలి ప్రధాన విషయములు

మోక్షమనగా విడుదల, బంధము నుండి విడుదల. సాంసారిక దుఃఖము నుండి, జననమరణముల నుండి విడుదల. అనగా బంధవిముక్తి అని భావము. అట్టి బంధవిమోచనరూపమగు కైవల్యము (మోక్షము) త్యాగముచేతనే లభించును. త్యాగమనినను, సన్న్యాసమనినను రెండును ఒకటియే. త్యాగము అనగా వాస్తవముగ దృశ్యభావనాపరిత్యాగము, సర్వసంగపరిత్యాగము. ప్రపంచము, దేహము, మనస్సు – ఇత్యాది సమస్తదృశ్యవస్తువుల యొక్క సంగమును పరిత్యజించి మోక్షరూపుడగు భగవంతునొకరినే, ఆత్మవస్తువునొక్క దానినే శరణుబొందవలెను. దృశ్యవస్తుసంబందమైన భావనయంతయు ఏ క్షణమున మనుజుడు త్యజించి వేయునో, ఆ క్షణముననే అతడు దృక్ – వస్తువగు ఆత్మగనే శేషించును. అదియే మోక్షస్థితి. అనగా క్షేత్రమును త్యజించుటచే క్షేత్రజ్ఞుడు శేషించునని భావము. దృశ్యసన్న్యాసము (త్యాగము)చే దృగ్రూపమగు మోక్షము (దైవము, ఆత్మ) లభించునని అర్థము. ఈ ప్రకారముగ సన్న్యాసము వలన, త్యాగము వలన, సర్వదృశ్యవస్తుసంగ పరిత్యాగము వలన మోక్షము లభించునని బోధింపబడిన అధ్యాయమగుట వలన దీనికి మోక్షసన్న్యాసయోగము అను పేరు కలిగినది.

మోక్షసన్న్యాసమునకు మరియొక అర్థము – మోక్షమనగా దైవము, భగవంతుడు. సన్న్యాసమనగా సమస్త కర్మములను అర్పించుట. సమస్త కర్మలను, ఆ కర్మల యొక్క ఫలములను భగవంతునకు అర్పించుటయే మోక్షసన్న్యాసయోగము అని చెప్పవచ్చును.

జననమరణ రూప సంసారబంధముల నుండి శాశ్వతముగా విముక్తిని పొంది, పరమానంద స్వరూపుడైన పరమాత్మను చెరుటయే మోక్షము. పూర్వోక్తములైన అన్నియధ్యాయముల సారరూపముగా మోక్షమార్గములైన సాంఖ్యయోగమును ‘సన్న్యాస’ మనియు, కర్మయోగమును ‘త్యాగ’ మనియు తెలిపి, భగవానుడు ఈ అధ్యాయమునందు వాటిని సాంగోపాంగముగా వర్ణించుచున్నాడు. కావున అట్లే సాక్షాత్తు మోక్షస్వరూపుడైన పరమేశ్వరుని యందే కర్మలనన్నింటిని సన్న్యసింపుమని అనగా త్యాగమొనర్పుమని తెలుపుచు, భగవానుడు తన ఉపదేశమును ముగించుచున్నాడు. అందువలననే ఈ అధ్యాయమునకు ‘మోక్షసన్న్యాసయోగము’ అని పేరు వచ్చినది.

Scroll to Top