భగవద్గీత - విజ్ఞాన యోగము - ఏడవ అధ్యాయము

విజ్ఞాన యోగమునందలి ప్రధాన విషయములు

పరమాత్మ యొక్క నిర్గుణ నిరాకార తత్త్వప్రభావ మహత్త్వాది రహస్యముల సంపూర్ణ జ్ఞానమునే జ్ఞానము అని అందురు. సగుణ నిరాకార, సాకార, తత్త్వముల లీలారహస్యమహత్త్వగుణ ప్రభావాదులను సమగ్రముగా తెలిసికొనుటయే ‘విజ్ఞానము’ అనబడును. విజ్ఞానమనగా విశేషజ్ఞానము. లేక అనుభవపూర్వకమైన జ్ఞానము. లేక ఆత్మ స్వరూపము. జ్ఞానమాత్రముతో సంతృప్తినొందక, విజ్ఞానమును గూడ సముపార్జించవలెనని భగవానుని యాజ్ఞ. అమానిత్వాది జ్ఞానగుణములనేకాక, ఆత్మతత్త్వ రూపమగు విజ్ఞానము యొక్క పరిచయమున్ను ముముక్షువు కలిగియుండవలెను. ఈ జ్ఞానవిజ్ఞాన సహితముగ భగవత్స్వరూపమును తెలిసికొనుటయే సమగ్రముగా భగవంతుని తెలిసికొనుట యగును. ఈ అధ్యాయమునందు భగవత్స్వరూపమును గూర్చియు, దానిని పూర్తిగా తెలిసికొనుటకు యోగ్యులైన వారిని గూర్చియు, సాధనలను గూర్చియు వర్ణనలు గలవు. కనుక ఈ అధ్యాయమునకు ‘విజ్ఞానయోగము’ అను పేరు వచ్చినది.
Scroll to Top