భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

అర్జునవిషాద యోగమునందలి ప్రధాన విషయములు

శ్రీ భగవానుడు అర్జునుని నిమిత్తముగా జేసికొని సమస్త విశ్వమునకు భగవద్గీతా రూపమున జేసిన మహోపదేశమునకు అవతారికగా ఈ అధ్యాయము ప్రారంభింపబడినది. యోగమనగా కూడిక. జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమే యోగం అనబడును. అట్టి ఐక్యమును సిద్ధింపజేయు మార్గమున్ను యోగమనియే చెప్పబడును. జీవ బ్రహ్మలయొక్క అట్టి సంయోగము నిష్కామకర్మచేగాని, భక్తిచేగాని, ధ్యానముచేగాని, జ్ఞానముచేగాని సిద్ధింపగలదు. కనుకనే ఆయా మార్గములను, సాధనలను అవలంబించునపుడు వానికి కర్మయోగమని, భక్తియోగమని, ధ్యానయోగమని, జ్ఞానయోగమని వేర్వేరుగా పేర్లు కలిగినవి. అయితే విషాదమును ఒక యోగమేనా? విషాదమనగా దుఃఖము. దుఃఖము యోగమెట్లు కాగలదు? ప్రాపంచిక వస్తువుల కొరకు, భోగభాగ్యముల కొరకు దుఃఖించుట యోగము కాదు కాని దైవము కొరకు, ధర్మము కొరకు దుఃఖించుట యోగమే అగును. విషాద యోగము కాదుకని ‘అర్జునవిషాద’ యోగం అగును. ఏలననగా అర్జునుడు ముల్లోకముల రాజ్యమును త్రుణప్రాయముగనెంచి, ప్రాపంచిక సుఖములను ఏవగించుకొని, ధర్మము కొరకై తీవ్రముగా పరితపించెను. ఇట్టి స్థితి ముముక్షువుల కత్యావస్యకము. అర్జునునకు కలిగిన వైరాగ్య భావన, ధర్మ జిజ్ఞాస, తీవ్రపరితాపము జ్ఞానప్రాప్తికి, భగవదైక్యమునకు దారితీయునది అగుటచే ఆతని విషాదమును ఒకానొక యోగముగా వర్ణింపబడినది. దీనిలో ఉభయపక్షములకు సంబంధించిన ముఖ్యమైన యోధుల నామములు పేర్కొనబడినవి. పిదప అర్జునుడు తన బంధుమిత్రులు నశించెదరను సందేహమునకు లోనయ్యెను. తత్పలితముగా అతడు మోహవ్యాకులుడై, తీవ్రవిషాదమునకు గురి అయ్యెను. ఇట్టి విషాదము కూడా సత్సాంగత్యప్రభావమున సాంసారిక భోగములయందు వైరాగ్యభావన కలిగించి శ్రేయోమార్గమున ముందునకు నడిపించును. అందువలన ఇది అర్జున విషాదయోగముగా పేర్కొనబడినది.
Scroll to Top