భగవద్గీత - సాంఖ్య యోగము - రెండవ అధ్యాయము

సాంఖ్య యోగమునందలి ప్రధాన విషయములు

సంఖ్యతో గూడినది సాంఖ్యము. సాంఖ్యమనగా జ్ఞానము. జ్ఞానవిచారణయందు అనాత్మవస్తువులను లెక్కించునపుడు సంఖ్యను ఆశ్రయించవలసి వచ్చును గనుక అయ్యది సాంఖ్యమని చెప్పబడెను. ప్రకృతి యందు గల 24 తత్వములను లేక 96 తత్వములను లెస్సగా శోధించి, అవి అనాత్మరూపములని త్యజించి వానికి సాక్షిగనునట్టి పరమాత్మను గ్రహించుటయే సాంఖ్యవిధ్య. ఆత్మానాత్మవివేక రూపమగు విజ్ఞానమే సాంఖ్యము. ఈ అధ్యాయము నందు శరణాగతుడైన అర్జునుడు తన శోకనివృత్తికై నిశ్చితమైన ఒకే ఒక ఉపాయమును తెల్పుమని భగవానుని ప్రార్థించెను. దానికి భగవానుడు 30వ శ్లోకం వరకు ఆత్మతత్వమును వర్ణించెను – సాంఖ్యయోగ సాధనయందు ఆత్మతత్త్వ శ్రవణ, మనన, నిధిధ్యాసనములే ముఖ్యములైనవి. ఈ అధ్యాయము నందలి 30వ శ్లోకము తరువాత స్వధర్మమును గూర్చి వర్ణించి, కర్మయోగ స్వరూపమును వివరించినప్పటికిని, ఉపదేశము యొక్క ఆరంభము సాంఖ్యయోగము తోడనే జరిగినది. ఆత్మతత్త్వ వర్ణనము ఇతరాధ్యాయముల కంటెను ఈ అధ్యాయము నందే విస్తృతముగా సమగ్రముగా చర్చింపబడినది. ఈ కారమున ఈ అధ్యాయమునకు ‘సాంఖ్యయోగము’ అనునామము ఏర్పడినది.
Scroll to Top