భగవద్గీత - కర్మ యోగము - మూడవ అధ్యాయము

కర్మ యోగమునందలి ప్రధాన విషయములు

ఈ అధ్యాయము నందు విహితకర్మలను విధిగా ఆచరింపవలసిన అవసరమును గూర్చి అనేక విధములుగా సహేతుకముగ నిరూపింపబడినది. అట్లే ప్రతివ్యక్తియు తన వర్ణాశ్రమధర్మములను అనుసరించి విధ్యుక్త కర్మలను ఎట్లు చేయవలెను? ఏల చేయవలెను? వానిని ఆచరింపకుండుటవలన కలుగు హానియేమి? ఆచరించినచో కలుగు ప్రయోజనమేమి? ఏ కర్మలు బంధకారకములు? ఏవి ముక్తిసాధకములు? – మున్నుగాగల ఈ విషయములు అన్నియు సాకల్యముగ ఇందు చర్చింపబడినవి. కర్మయోగ విషయములు ఇతర అధ్యాయముల కంటెను, అధికముగ, విస్తృతముగ వర్ణింపబడినవి. లోకమున కర్మ చేయక ఏ జీవియు ఉండలేదు. వారి వారికి నియమితులైన కర్మలను వారు తప్పక నిష్కామబుద్ధితో ఆచరించవలయును. తమ విధ్యుక్త కర్మమును ఫలాపేక్ష లేక ఈశ్వరార్పణబుద్ధితో గావింపవలెను. ఆయా కార్యములను మనుజుడు ఎందులకు ఆచరించవలయునో, వానిని ఆచరించనిచో కలుగు అపకారమేమియో, ఆచరించినచో కలుగు మేలేదియో, ఏ కర్మ బంధమును గల్గించునో, ఏ కర్మ ముక్తికి దారితీయునో – ఈ ప్రకారముగ కర్మకు సంబంధించిన వివిధ విషయములు విపులముగ ఈ అధ్యాయమున చర్చించబడియుండుట వలన దీనికి కర్మయోగము అని పేరు వచ్చినది.
Scroll to Top