భగవద్గీత - దైవాసురసంపద్విభాగ యోగము - పదహారవ అధ్యాయము

దైవాసురసంపద్విభాగ యోగమునందలి ప్రధాన విషయములు

ఈ అధ్యాయమునందు దైవీసంపద – ఆసురీ సంపద అను రెండు విభాగములను భగవానుడు వర్ణించుచున్నాడు. సంపదయనగా ఐశ్వర్యము. దైవసంపద అనగా దైవికములగు సద్గుణముల యొక్క సంపత్తి, దైవసంబంధమైన గుణరాశి, జీవుని భగవంతుని సమీపమునకు చేర్చునట్టి శీలసంపద. అసురసంపద అనగా రాక్షసగుణములు, దుర్గుణరాశి. భగవంతుని దూరముగ జేసివైచునట్టి దుశ్శీలము. ఈ అధ్యాయమునండు శ్రీకృష్ణపరమాత్మ దైవగుణములను, అసురగుణములను రెండింటిని గూర్చి విపులముగ తెలియజేసిరి. ఏలయనిన ఆ రెండింటిని తెలిసికొనియుండినచో సాధకుడు తన హృదయమును బాగుగ పరిశోధించుకొని, దైవగుణములులేనిచో సంపాదించుటకును, ఉన్నచో ఇంకను అభివృద్ధిపరచుటకును, అసురగుణములుండినచో పారద్రోలుటకును అవకాశము ఉండును. కావున రెండిటిని తెలిసికొనియుండవలెను. ఈ ప్రకారముగ ఆధ్యాత్మక్షేత్రమున సర్వులకును ఉపయోగముగ నుండుటకై భగవానుడు ఆ సద్గుణ, దుర్గుణముల రెండిటిని, దైవ, అసుర సంపదల రెండిటిని చక్కగ విభజించి తెలిపిన అధ్యాయమగుటచే దీనికి దైవాసురసంపద్విభాగయోగము అను పేరు వచ్చినది.
Scroll to Top