భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము - పదిహేనవ అధ్యాయము

పురుషోత్తమప్రాప్తి యోగమునందలి ప్రధాన విషయములు

పురుషోత్తముడనగా పరమాత్మ. ఉపాధి అభిమాని అగు క్షరపురుషుని కంటెను, జీవుడు అను అక్షరపురుషుని కంటెను వేరై వారిరువురి కంటెను ఉత్తముడై పరగుట వలన పరమాత్మకు పురుషోత్తముడని పేరు వచ్చినది. సమస్త జగత్తునకు కర్తయు, హర్తయు, సర్వశక్తిమంతుడును, అందరికిని నియంతయు, సర్వవ్యాప్తియు, అంతర్యామియు, పరమదయాళువు, అందరికిని సుహృదుడును, సర్వాధారుడును, శరణాగతవత్సలుడును, సగుణ పరమేశ్వరుడును, పురుషోత్తముడును ఐన భగవానుని గుణ ప్రభావ స్వరూపముల వర్ణనము గలదు. క్షరపురుషుడు (క్షేత్రము), అక్షరపురుషుడు (క్షేత్రజ్ఞుడు), పురుషోత్తముడు (పరమేశ్వరుడు) – ఈ ముగ్గురిని వర్ణించి క్షరాక్షరులకంటె భగవానుడే ఏ విధముగా ఉత్తముడు? అతడు పురుషోత్తముడుగా పిలువబడుటకు కారణమేమి? ఆయనను పురుషోత్తమునిగా ఎరుంగుటవలన కలుగు మహాత్త్వమేమి? అతడు ఏ విధముగా లభ్యుడగును – మొదలైన విషయములన్నియును సమగ్రముగా ఇందు వివరింపబడినవి. ఆ కారణమున ఈ అధ్యాయమునకు ‘పురుషోత్తమప్రాప్తియోగము’ అని పేరు వచ్చినది.
Scroll to Top