భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - రెండవ శ్లోకము

సంజయ ఉవాచ
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా
ఆచార్యముపసంగమ్యం రాజా వచనమబ్రవీత్

తదా = అప్పుడు
రాజా = రాజైన
దుర్యోధనః = దుర్యోధనుడు
వ్యూఢం = మోహరించియున్న
పాండవానీకమ్ = పాండవసేనను
దృష్ట్వా = చూచి
తు = మరియు
ఆచార్యం = ద్రోణాచార్యుని
ఉపసంగమ్య = సమీపమునకు చేరి
వచనమ్ = వాక్యమును
అబ్రవీత్ = పలికెను

తాత్పర్యం :-

ధృతరాష్ట్రునితో సంజయుడు ఇట్లు పలికెను – ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించియున్న పాండవసైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి యిట్లు పలికెను.

సంజయుడు దుర్యోధనుని రాజశబ్దముతో వ్యవహరించుటలో అనేక భావములుండవచ్చును. దుర్యోధనుడు గొప్పవీరుడు, రాజనీతిజ్ఞుడు, అంతియేగాక పరిపాలన సంబంధములైన కార్యములన్నింటిని ఆతడే నిర్వర్తించుచుండెను. సత్పురుషులు అందరినీ గౌరవింతురు. సంజయుడు సత్పురుష స్వభావము గలవాడు.

ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ కుమారుడు అయిన దుర్యోధనుడు, యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్న, తన సైన్యాన్ని, పాండవుల సైన్యాన్ని ఒక్కసారి తేరిపార చూచాడు. తన బలం ఎంతో ఎదుటి బలం ఎంతో అంచనా వేసుకున్నాడు. తన సైన్యం ఏయే వ్యూహములు రచించారో, పాండవుల సైన్యముల యొక్క వ్యూహరచనను గమనించాడు. పాండవసేనా వ్యూహరచన విచిత్ర పద్ధతిలో నుండెను. పాండవసేనాపతియగు దృష్టద్యుమ్నుడు యుద్ధశాస్త్రానుసారముగ తన సైన్యమును వజ్రమను పేరుగల వ్యూహముగ అమర్చియుండెను. వెంటనే తన రథమును తన గురువుగారు ద్రోణాచార్యుల వద్దకు పోనిమ్మన్నాడు.

కౌరవుల సైన్యాధ్యక్షుడు భీష్ముడు. యుద్ధము గురించి, అందులో అనుసరించవలసిన వ్యూహములు ప్రతి వ్యూహములు గురించి చర్చించాలంటే దుర్యోధనుడు భీష్ముని వద్దకుపోవాలి. కాని కేవలం తన పక్షాన యుద్ధం చేయడానికి వచ్చిన ద్రోణాచార్యుల వద్దకు ఎందుకు వెళ్ళాడు? భీష్ముని మీద నమ్మకం లేదా! భీష్ముడు, పాండవులు తన మనుమలు అనే మమకారంతో, సరిగా యుద్ధం చేయడు అనే సందేహం కలిగిందా! లేక భీష్ముని కంటే ఆచార్య ద్రోణుడు పరాక్రమవంతుడా! ఇది అందరి మనసులో తొలిచే ప్రశ్న. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. “పాండవులు నా మనుమలు. నేను పాండవులను తప్ప అందరినీ చంపుతాను” అని ఇదివరకే ప్రకటించాడు భీష్ముడు. ద్రోణునికి అటువంటి నియమం లేదు. ఎందుకంటే ద్రోణునికి అందరూ శిష్యులే! ఎవరి మీదా అధిక ప్రేమ లేదు. కాకపోతే అర్జునుడు అంటే ప్రత్యేకమైన అభిమానము. అంతవరకే. ఆ కారణం చేత ద్రోణుని పాండవుల మీదికి రెచ్చగొడదామని వెళ్లి ఉండవచ్చు. దుర్యోధనుడిది కుటిల బుద్ధి. ఎప్పుడూ సక్రమంగా ఆలోచించడు. వక్రంగానే ఆలోచిస్తాడు.

పాండవుల సైన్యాధ్యక్షుడు ధృష్టద్యుమ్నుడు. అతడు పాండవుల భార్య ద్రౌపదికి అన్నగారు. అతడి తండ్రి ద్రుపదుడు ద్రోణాచార్యుని అవమాన పరిచాడు. దానికి అర్జునుడి ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు. ద్రోణుని చంపే కుమారుడు కావాలని తపస్సు చేసాడు ద్రుపదుడు. దాని ఫలితంగా ధృష్టద్యుమ్నుడు అగ్నిలోనుండి జన్మించాడు. కాబట్టి దృష్టద్యుమ్నుడు కేవలం ద్రోణుని చంపడానికే పుట్టాడు అన్నది అందరికీ తెలుసు. ఈ విషయం తెలిసి కూడా ద్రోణుడు ధృష్టద్యుమ్నుడుకి విలువిద్య నేర్పించాడు. అస్త్ర శస్త్రముల ప్రయోగ ఉపసంహారములు నేర్పించాడు. కాబట్టి ఎదుటి పక్షాన సైన్యాధ్యక్షుడు ఉన్న ధృష్టద్యుమ్నుడు ద్రోణుని శిష్యుడు. తనను చంపడానికే పుట్టిన దృష్టద్యుమ్నుడుని ద్రోణుడు చంపుతాడా? లేక శిష్యుడు అని ఉపేక్ష వహిస్తాడా అన్న సందేహము దుర్యోధనుడిలో మొలకెతింది. ఈ విషయం తేల్చుకోడానికే నేరుగా ద్రోణాచార్యుల వద్దకు వెళ్లి ఇలా అంటున్నాడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top