భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - నలుబై నాలుగవ శ్లోకము

ఉత్పన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన ।
నరకేఽనియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ॥

జనార్దన! = ఓ జనార్దనా!
ఉత్పన్నకుల ధర్మాణామ్ = కులధర్మములు నశించినవారైన
మనుష్యాణామ్ = మనుష్యులకు
అనియతమ్ = నిరవధికముగా
నరకే = నరకమునందు
వాసః = నివాసము
భవతి = అగును
ఇతి = అని
అనుశుశ్రుమ = వినుచున్నాము

తాత్పర్యం :-

ఓ జనార్దనా! కులధర్మములు నశించినవారికి కలకాలము నరకప్రాప్తి తప్పదని ప్రతీతి.

కులధర్మములు, జాతిధర్మములు నశించినచో మానవులు పూర్తిగా అధర్మములయందు చిక్కుకొందురు. వారు చేసిన పాపములకు ఫల స్వరూపముగా కుంభీపాక, రౌరవాది నరకములయందు ప్రవేశించి దీర్ఘకాలము వరకు నానావిధ భయంకర యమయాతనలు అనుభవించవలసి వచ్చును అని మేము పరంపరగా వినుచున్నాము. అందువలన కులనాశనమునకు మూలమగు చేష్టలు ఎన్నడు కూడా చేయవలదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top