భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - నలుబై ఏడవ శ్లోకము

సంజయ ఉవాచ
ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ ।
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ॥

సంజయః ఉవాచ = సంజయుడు పలికెను
ఏవం = ఆ విధముగా
ఉక్త్వా = పలికి
అర్జునః = అర్జునుడు
సంఖ్యే = రణరంగమునందు
రథ = రథముయొక్క
ఉపస్థ = ఆసనము మీద
సశరం = బాణములతో సహా
చాపం = విల్లును
విసృజ్య = పడవేసి
శోక = దుఃఖముచే
సంవిగ్న = కల్లోలితమైన
మానసః = మనస్సునందు
ఉపావిశత్ = చతికలబడెను

తాత్పర్యం :-

సంజయుడు పలికెను, అర్జునుడు ఈ విధముగా పలికి శోకసంవిగ్నమానసుడై, యుద్ధభూమియందు ధనుర్బాణములను త్యజించి, రథము వెనుకభాగమున చతికలబడెను.

విషాదమగ్నుడైన అర్జునుడు భగవానునితో ఇన్ని మాటలను చెప్పి, గాండీవ ధనుర్బాణములను వీడి, రథమునందలి వెనుకభాగమున మౌనముగా చతికిలబడి, నానావిధచింతలలో మునిగిపోయెను. ఆతని మనఃఫలకము నందు కులనాశనము, తద్ద్వారా జరుగబోవు భయంకరమగు పాపములు, ఆ పాపఫలితములైన భయానక దృశ్యములు కనిపించసాగెను. ఆతని ముఖమండలముపై విషాదము క్రమ్ముకొనెను. నేత్రములు శోకాకులములయ్యెను.

అర్జునుడు శోకాకులితచిత్తుడై ధనుర్బాణములను సైతము జారవిడిచెను. అర్జునుని జీవితమునందు నిరుత్సాహముచే ధనుస్సును వదిలివేసిన ఘట్ట మింతదనుక ఒకటియును లేదు. కావున దీనికేదియూ ప్రబలమైన కారణముండియే యుండవలెను. స్వజనక్షయమునుగూర్చిన ఆందోలనయే అది. ఆ ఆందోళన ఆవేదనగా మారెను. తత్ఫలితముగా నాతడు రాజ్యమును, భోగములను తృణీకరించివైచెను. యుద్దమును నిరాకరించెను. అర్జునుని యొక్క ఈ పరమవిరక్తిని ఊతగా దీసుకొని శ్రీకృష్ణపరమాత్మ యాతనికి చక్కని ఆత్మజ్ఞానోపదేశంచేసిరి. అర్జునుని విషాదము విషాదముగానుండక విషాదయోగముగా మారెను. ఏలయనిన అర్జునుడు ప్రాపంచిక సుఖములయెడల, రాజ్యభోగములయెడల విముఖత్వము కలిగి, ధర్మమును తెలిసికొనుటకొరకై పరితపించెను. అట్టి పరితాపము ముముక్షువుల కత్యావశ్యకమైయున్నది. దైవముకొరకు, ధర్మముకొరకు కలుగు పరితాపము యోగమునకు దారితీయును. ఒకదానియందు విరక్తి, మరియొక దానియందు ఆసక్తి మోక్షమునకు అత్యావశ్యకమైయున్నది. అనగా ప్రాపంచిక వైభవములందు విరక్తి, ధర్మమునందు దైవమునందు ఆసక్తియుండిననే పరమార్థపదమున జీవుడు త్వరితముగా పురోగమనము సలుపగలడు. అర్జునునకీ రెండును సమకూడినవి. కనుకనే యాతని అర్హతను గుర్తెరిగి శ్రీకృష్ణపరమాత్మ వెనువెంటనే చక్కని జ్ఞానోపదేశమును జేసిరి. అర్జునునివలెనే ఎవరైనపట్టికినీ దృశ్యవిషయములపై విరక్తి కలిగి ధర్మముకొరకై తహతహలాడినచో, భగవదనుగ్రహముచే ఆతనికి జ్ఞానోదయము, పరమశాంతి తప్పక లభించగలవు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top