భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - ఇరవై ఒకటవ శ్లోకము, ఇరవై రెండవ శ్లోకము

అర్జున ఉవాచ
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ।
యావదేతాన్ నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ ॥
కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే ॥

అర్జునః ఉవాచ = అర్జునుడు పలికెను
సేనయోరుభయోః = రెండు సేనల
మధ్యే = నడుమ
రథమ్ = రథమును
స్థాపయ = నిలుపుము
మే = నా యొక్క
అచ్యుత = శ్రీకృష్ణ (ఓ చ్యుతిలేనివాడా)
యావత్ = ఎంతవరకు
ఏతాన్ = వీరినందరిని
నిరీక్షే = చూడగలుగుదును
అహమ్ = నేను
యోద్ధుకామాన్ = యుద్ధము చేయగోరి
అవస్థితాన్ = యుద్దరంగమున కూడినవారిని
కైః = ఎవరితో
మయా = నాచేత
సహ = కూడా
యోద్ధవ్యమ్ = యుద్ధము చేయవలసియున్నదో
ఆస్మిన్ = ఈ
రణసముద్యమే = యుద్ధయత్నమునందు

తాత్పర్యం :-

అర్జునుడు పలికెను, ఓ అచ్యుతా! దయచేసి రెండుసేనల నడుమ నా రథమును నిలుపుము. తద్ద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైనవారిని మరియు ఈ మహాసంగ్రామమున నేను తలపడవలసిన వారిని గాంచగలుగుదును.

శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడగు దేవదేవుడైనను తన నిర్హేతుక కరుణ వలన మిత్రుని సేవ యందు నియుక్తుడయ్యెను. తన భక్తుల యెడ ప్రేమను చూపుటలో ఆతడెన్నడును విఫలత్వము నొందడు. కనుకనే ఆతడు ఇచ్చట “అచ్యుతుని” గా సంబోధింపబడినాడు. రథసారథిగా ఆతడు అర్జునుని ఆదేశములను అమలుపరచ వలసివచ్చును. ఆ విధముగా నొనర్చుటకు ఆ దేవదేవుడు సంకోచింపనందున అచ్యుతునిగా పిలువబడినాడు. తన భక్తుని కొరకు రథచోదకుని స్థానమును గ్రహించినను ఆతని దివ్యస్థితికి ఎన్నడును భంగము రాదు. అన్ని పరిస్థితుల యందును ఆతడు దేవదేవుడే. ఇంద్రియాధిపతియైన హృశీకేశుడే. భగవానుడు మరియు ఆతని సేవకుని నడుమ గల సంబంధము దివ్యమైనది మరియు మధురమైనది. సేవకుడు సదా భగవానునికి సేవను గూర్చ సంసిద్దుడై యుండును. అదేవిధముగా భగవానుడు సైతము భక్తునికి ఏదియో కొంత సేవగూర్చెడి అవకాశము కొరకై వేచియుండును. ఆదేశము లోసగువానిగా తాను ఆజ్ఞల నొసగుట కన్నను శుద్ధభక్తుడైనవాడు తననే ఆజ్ఞాపించు స్థానమును గైకొనినచో ఆతడు మిక్కిలి ముదమందును. వాస్తవమునకు ఆతడు ప్రభువైనందున ప్రతియొక్కరు ఆతని ఆజ్ఞానుపాలకులే. ఆజ్ఞాపించుటకు ఆతనికి అధికులెవ్వరును లేరు. కాని తనను శుద్ధభక్తుడైనవాడు ఆజ్ఞాపించుట తటస్థించినపుడు ఆ దేవదేవుడు దివ్యానందము ననుభవించును. అయినప్పటికిని అన్ని పరిస్థితుల యందును ఆతడు అచ్యుతుడైన ప్రభువే అయియున్నాడు.

భగవానుని శుద్ధభక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో మరియు సోదరులతో యుద్ధము చేయగోరలేదు. కాని ఎటువంటి శాంతిమయ రాయబారమునకు సైతము సమ్మతింపని దుర్యోధనుని మొండితనము వలననే అతడు యుద్ధ రంగమునకు బలవంతముగా రావలసివచ్చెను. కనుకనే యుద్ధరంగమునందు ఏ ప్రముఖులు ఉపస్థితులై యుండిరా యని గాంచుటలో అతడు ఆతురతను కలిగియుండెను. రణరంగమున శాంతియత్నములు చేయుటన్న ప్రశ్నలేకున్నను వారిని అతడు తిరిగి చూడగోరెను. అంతియేగాక అవాంఛితమైన యుద్ధము వైపుకు వారెంత మ్రొగ్గు చూపియుండిరో అతడు గాంచగోరెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top