భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - తొమ్మిదవ శ్లోకము

అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః ।
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ॥

అన్యే, చ = ఇతరులైనవారు
మదర్థే = నాకొరకై
త్యక్తజీవితాః = (తమ) జీవితములను పణముగా ఒడ్డినవారును
బహవః = పెక్కుమంది
శూరాః = శూరులు
నానాశస్త్ర ప్రహరణాః = వివిధములకు శస్త్రాస్త్రములను గలిగియున్నవారును
సర్వే = అందరును
యుద్ధవిశారదాః = యుద్ధమున కుశలురైన వారు
(సంతి) = ఉన్నారు

తాత్పర్యం :-

ఇంకను పెక్కుమంది శూరులును, వీరులును మన సైన్యమునందు కలరు. వీరందరును యుద్ధవిశారదులు. నానాశస్త్రాస్త్రధారులు. నాకొరకు తమ ప్రాణముల నొడ్డియైనను యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నవారు.

ఇంతకుముందు శల్యుడు, బాహ్లీకుడు, భగదత్తుడు, కృతవర్మ మరియు జయద్రథాధీ మహారథుల పేర్లు తెలుపబడలేదు. ప్రస్తుతశ్లోకము నందు వారందరినీ ఉద్దేశించి దుర్యోధనుడు – ‘ఇప్పటి వరకు నేను తెల్పిన వీరులే గాక మన పక్షమునందు మరెందరో కృపాణము, గద, త్రిశూలాది ఆయుధములను హస్తములయందు ధరించి శస్త్రములచేత, బాణ, తోమర, శక్తి మున్నగు ప్రయోగాస్త్రములచే సుసజ్జితులైన యోధులు, యుద్ధకళాకుశలురగు మహారథులు గలరు. వీరందరును నా కొరకై తమ ప్రాణముల నర్పించుటకైననూ సిద్ధముగా నున్నారు. అంతియేగాక వీరందరు తమ అంతిమశ్వాసను విడుచువరకు నా విజయమునకై నిలబడి వీరోచితముగా పోరాడుదురు అని తెలిపెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top