భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - పదహారవ శ్లోకము

అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ॥

కుంతీపుత్రః = కుంతీదేవి యొక్క కుమారుడును
రాజా = రాజైన
యుధిష్ఠిరః = యుధిష్ఠిరుడు
అనంతవిజయమ్ = అనంతవిజయమను పేరుగల శంఖమును
నకులః = నకులుడు
సహదేవః, చ = సహదేవుడును
సుఘోష మణిపుష్పకౌణ = సుఘోషము, మణిపుష్పకము అను పేరుగల శంఖములను (పూరించిరి)

తాత్పర్యం :-

కుంతీపుత్రుడును, రాజును ఐన యుధిష్ఠిరుడు ‘అనంత విజయము’ అను శంఖమును, నకులసహదేవులు ‘సుఘోష, మణిపుష్పకము’ అను శంఖములు పూరించిరి.

పాండుమహారాజు కుమారులు అయిదుగురిలో యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు కుంతీదేవికి జన్మించిన వారు. నకులుడు, సహదేవుడు మాద్రికుమారులు. యుధిష్ఠిరుడు మరియు నకులసహదేవుల తల్లులు వేర్వేరను విషయమును స్పష్టపరచుటకొరకే యుధిష్ఠిరుని ‘కుంతీపుత్రు’ డని పేర్కొనెను. పైగా ప్రస్తుతము రాజ్యభ్రష్టుడయినప్పటికినీ అతడు తొలుత రాజసూయాగము జేసి రాజులందరిపై విజయమును సాధించి, చక్రవర్తియై సామ్రాజ్యమును స్థాపించెను. భవిష్యత్తునందు అతడే రాజు కాగలడని సంజయుని దృఢ విశ్వాసము. అంతేగాక ఇప్పుడు కూడా ఆతని దేహము నందు సమస్త రాజలక్షణములు ఉట్టిపడుచున్నందుననే యుధిష్ఠిరుని సంజయుడు ‘రాజు’ అని పేర్కొనెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top