భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - పన్నెండవ శ్లోకము

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః ।
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ॥

కురువృద్ధః = కురువంశము వారిలో వృద్ధుడును
ప్రతాపవాన్ = పరాక్రమవంతుడును ఐన
పితామహః = భీష్మపితామహుడు
తస్య = అతని (దుర్యోధనుని) యొక్క హృదయమునందు
హర్షమ్ = సంతోషమును
సంజనయన్ = కలిగించుచు
ఉచ్చైః = బిగ్గరగా
సింహనాదమ్, వినద్య = సింహగర్జనమొనర్చి
శంఖమ్ = శంఖమును
దధ్మౌ = మ్రోగించెను

తాత్పర్యం :-

కురువృద్ధుడును, ప్రతాపశాలియును ఐన భీష్మ పితామహుడు (దుర్యోధనుని ఈ మాటలు విని) అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమొనర్చి, తన శంఖమును పూరించెను.

కురువంశము నందు బాహ్లీకుడు తప్ప మిగిలిన వారందరికంటెనూ పెద్దవాడు భీష్ముడు. కౌరవ, పాండవులందరిని ఇతడు ఒకే విధముగ ఆదరించును. పితామహుడగుటచే ఇరువర్గముల వారికిని పూజ్యుడే. అందుచే సంజయుడు ఇతనిని కురువృద్ధుడని, పితామహుడని పేర్కొనెను. వయసునందు వృద్ధుడైననూ బల, వీర్య, తేజఃపరాక్రమముల యందును, సామర్థ్యమునందును, వీరులకు యువకిశోరములను మించినవాడు. ఇందుచే ఇతనిని ‘ప్రతాపవాన్’ అని పేర్కొనెను.ద్రోణాచార్యుని వద్ద నిలిచిన దుర్యోధనుడు పాండవసేనను గాంచి ఒకింత కలవరపడి, చింతాక్రాంతుడగుటను భీష్ముడు గ్రహించెను. దుర్యోధనుడు తన లోలోని వ్యథను అణచుకొని యోధులలో ఉత్సాహము పెంపొందించుటకు తన సేనను ప్రశంసించుచుండుటను గూడ అతడు పరికించెను. అంతేగాక, ద్రోణాచార్యాది మహారథులనందరిని, తనను రక్షించుటకై ప్రార్థించుచుండుటను కూడా ఆయన గమనించెను. అట్టితరి భీష్మపితామహుడు తన వీరత్వమును చూపి దుర్యోధనుని ఉల్లాస పరచుటకై ప్రధాన సేనాపతిగా సమస్త సైన్యమునకును యుద్ధారంభసూచనగా సింహసదృశుడై గర్జించి, బిగ్గరగా శంఖమును పూరించెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top