భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - పంతొమ్మిదవ శ్లోకము

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ ।
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ॥

చ = మరియు
సః = ఆ (అట్టి)
తుములః = భయంకరమైన
ఘోషః = నాదము
నభః చ = ఆకాశమును
పృథివీమ్ ఏవ = భూమిని గూడ
వ్యనునాదయన్ = ప్రతిధ్వనింప జేయుచు
ధార్తరాష్ట్రాణామ్ = ధార్తరాష్ట్రుల యొక్క అనగా మీ వారి
హృదయాని = హృదయములను
వ్యదారయత్ = కకావికలములుగాజేసెను

తాత్పర్యం :-

పాండవపక్ష మహాయోధుల శంఖనినాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలములయ్యెను.

పాండవసేనలోని వీరులెల్లరు ఒక్కుమ్మడిగా శంఖములు మ్రోగింపగనే ఆ ధ్వని ఎంతో గంభీరమై, గూఢమై, ఉచ్చమై, భయానకమై సమస్త భూనభోంతరాళములు వ్యాపించెను. ఈ విధముగా అన్ని దిశలయందు భీషణధ్వనులు నిండగా, సర్వత్ర ప్రతిధ్వని యుత్పన్నమై భూమ్యాకాశములు మార్మ్రోగెను. ఆ శంఖారావముల ప్రతిధ్వనిని నిలిచియున్న అన్యయోధులందరికిని హృదయకుహరములలో మహాభయము జనింపగా, వారు తమ గుండెలను ఎవరో పిండుచున్నట్లుగా వ్యథజెందిరి.

పాండవుల శంఖధ్వనితో కౌరవవీరులు వ్యథితులగుటను వర్ణించిన సంజయుడు ఇక రాబోవు నాలుగు శ్లోకములలో శ్రీకృష్ణభగవానునితో అర్జునుడు పలికిన ఉత్సాహపూరిత వచనములను వర్ణించుచున్నాడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top