భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము – ఇరవై మూడవ శ్లోకము

యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః ।
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవ ॥

దుర్బుద్ధేః = దుర్బుద్ధిగలవాడైన
ధార్తరాష్ట్రస్య = దుర్యోధనునియొక్క
యుద్ధే = యుద్ధమునందు
ప్రియచికీర్షవః = ప్రియమునుగూర్ప దలచినట్టివారు
యే = ఎవరెవరు
ఏతే = (రాజులుగలరో) వీరు
అత్ర = ఇచ్చట (ఈ సమర భూమియందు)
సమాగతాః = చేరియున్నారో
యోత్స్యమానాన్ = యుద్ధసన్నద్ధులై యున్నట్టి వారిని
అహమ్ = నేను
అవేక్షే = చూచెదనుగాక

తాత్పర్యం :-

దుర్బుద్ధియైన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచి వచ్చియున్న రాజులను అందరిని ఒకపరి పరికించెదను.

పన్నెండేళ్ళు అరణ్యవాసము ఒక ఏడు అజ్ఞాతవాసము వెరసి పదుమూడేండ్లు పూర్తియైన పిమ్మట పాండవులకు వారి రాజ్యమును తిరిగి ఇచ్చివేయుటకు నిశ్చితమై యుండెను. అంతవరకు వారి రాజ్యము కౌరవుల చేతిలో న్యాసరూపమున నుండెను. కాని ఆ రాజ్యమును అన్యాయముగా కాజేయవలెనను దుర్నీతితో దుర్యోధనుడు దానిని (ఒప్పందమును) పూర్తిగా తిరస్కరించెను. దుర్యోధనుడు పాండవులయెడల ఇప్పటివరకూ పెక్కు అన్యాయములను, అత్యాచారములను చేయుచునేయుండెను. కాని, ఈసారి అతని అన్యాయము సహింపరానిదయ్యెను. దుర్యోధనుని ఇట్టి పాపబుద్ధిని తలంచి అర్జునుడు ఆతనిని దుర్భుద్ధియని పేర్కొనెను.

పాపబుద్ధి గల దుర్యోధనుని అన్యాయములును అత్యాచారములును సకల లోకములకును విదితములు. అయినను వానికి ప్రియమును చేకూర్పవలెనను కోర్కెతో అతనికి అండగా నిలుచుటకై రాజులనేకులు ఇచట చేరియున్నారు. దీనిచే దుర్యోధనునితో బాటు వీరి బుద్ధి కూడా పాపభూయిష్ఠమైనదని తెలియుచున్నది. వీరందరును ఈ అన్యాయమును బాహాటముగా సమర్థించుటకై ఇట కూడియున్నారు. తమ ఠీవిని ప్రదర్శించి అతని వెన్నుతట్టుచున్నారు. కాని అతనికి (దుర్యోధనునకు) మేలు చేకూర్పదలచియు నిజమునకు కీడునే కూర్చుచున్నారు. తమను తాము గొప్ప బలవంతులమని యెంచి సమరమొనర్చుటకై ఔత్సాహికులై నిలిచిన వీరు ఎవరెవ్వరో ఒక్కమారు చూచెదను. అటులనే రణరంగమున వీరెంతటి యోధులోపరికించెదను. అన్యాయమును, అధర్మపక్షమును వహించిన వీరందరికి నాదెబ్బరుచి చూపించెదను! ఇదియే అర్జునుని మాటల ఆంతర్యము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top