భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - ఎనిమిదవ శ్లోకము

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః ।
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ॥

భవాన్, చ = పూజ్యులైన మీరును
భీష్మః, చ = భీష్మపితామహుడును
కర్ణః, చ = కర్ణుడును
సమితింజయః = సంగ్రామ విజయుడగు
కృపః, చ = కృపాచార్యుడును
తథా, ఏవ = అట్లే
అశ్వత్థామా = అశ్వత్థామయు
వికర్ణః, చ = వికర్ణుడును
సౌమదత్తిః = సోమదత్తుని కుమారుడగు భూరిశ్రవుడును

తాత్పర్యం :-

మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు.

ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి పుత్రుడు. ఈతడు అగ్నివేశ మహర్షియొద్ద మరియు పరశురాముని యుద్ద రహస్యముగా సమస్త అస్త్ర శస్త్రములను పొందెను. వేద వేదాంగ నిపుణుడు, మహా తపస్వి, ధనిర్వేద, శస్త్రాస్త్ర విద్యలో గొప్ప మర్మజ్ఞుడు, అనుభవశాలి. ఇంకనూ యుద్ధవిద్యల యందు ఆరితేరినవాడు. అత్యంత సాహసి. అతిరథుడు, వీరుడు, బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రము మున్నగు దివ్యాస్త్రముల ప్రయోగములను అతడు చక్కగా తెలిసినవాడు. యుద్ధమున తన సంపూర్ణ శక్తి నొడ్డి పరాక్రమించిన వేళ ఈతనినెవరునూ గెలువజాలరు. శరద్వానుమహర్షి కుమార్తెయగు కృపితో ఇతని వివాహమయ్యెను. వీరి కుమారుడే అశ్వత్థామ. ద్రుపదరాజునకు బాల్యసఖుడగు ద్రోణుడు ఒకనాడు అతని కడగేగి చిన్ననాటి చనువుతో ‘ప్రియమిత్రమా!’ అని సంబోధించెను. ఐశ్వర్యమదమత్తుడైయున్న ద్రుపదుడు అతనిని అవమానించుచు ఇట్లనెను. ‘నావంటి ఐశ్వర్యవంతుడైన రాజుతో నీవంటి ధనహీనునకు, ధరిద్రునకు మైత్రి ఏవిధముగను పొసగదు.’ ద్రుపదుని తిరస్కారమునకు ద్రోణుడు లజ్జితుడై, లోలోన మిక్కిలి బాధపడి హస్తినాపురమునకేగి తన బావమరిది యగు కృపాచార్యుని యొద్ద ఉండసాగెను. అచ్చట భీష్మపితామహునితో పరిచయమేర్పడి కౌరవపాండవులకు విలువిద్యలను నేర్పుటకై నియమింపబడెను. విద్యముగిసిన పిదప గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తేవలయునని శిష్యులకు తెల్పెను. అందు అర్జునుడే గురువుగారి ఆజ్ఞను పాలింపగలిగెను. వెంటనే వెళ్లి రణరంగమునందు ద్రుపదునోడించి మంత్రులతో పాటుగా అతనిని పట్టి తెచ్చెను. అప్పుడు ద్రోణుడు ద్రుపదుని చంపక అతనికి బుద్ధిచెప్పి వదిలిపెట్టెను. భాగీరథికి ఉత్తరదిశగానున్న అతని రాజ్యమును స్వాధీనపరచుకొనెను. మహాభారత యుద్ధము నందు ఈతడు సేనాధిపతిగా నుండి ఐదు దినముల వరకు హోరాహోరిగా పోరాడేను. తుదకు ‘తన పుత్రుడగు అశ్వత్థామ మరణించె’నను భ్రమ గెలుపు వార్తను విని అస్త్రసన్న్యాసము చేసెను. వెనువెంటనే సమాధిస్థితుడై భగవానుని ధ్యానింపసాగెను. ఇతడు ప్రాణత్యాగము చేసిన మీదట ఆతనిజ్యోతిర్మయస్వరూప తేజస్సు దిజ్మమండలమంతా నిండిపోయెను. అట్టితరి దృష్టద్యుమ్నుడు వాడియైన తన కరవాలముతో ఆతని తల నరికివేసెను.

ద్రోణుడు అత్యంత ప్రసన్నుడై తన పక్షమున అత్యుత్సాహముతో యుద్ధము చేయుటకై ‘మీరు’ అనుచు దుర్యోధనుడు ఆతనిని ఇచట అందరికంటే ముందుగా పేర్కొనెను. విద్యనేర్పిన గురువగుటచే తాను గౌరవపూర్వకముగా, మొట్టమొదట ‘మీరు’ అనుచు పేర్కొనుట యుక్తియుక్తమే కదా!

భీష్ముడు శంతను మహారాజు వలన గంగాదేవియందు జన్మించెను. ఇతడు ‘ద్యో’ అను పేరుగల తొమ్మిదవ వస్తువు యొక్క అవతారము. ఇతని మొదటి పేరు దేవవ్రతుడు. ఇతడు సత్యవతితో తన తండ్రి వివాహమును జరిపించుటకై ఆమె తండ్రి దాశరాజు ఆజ్ఞానుసారము పూర్ణయౌవనావస్థ యందే స్వయముగా జీవితాంతము బ్రహ్మచారిగా నుందునని రాజ్యపదవిని త్యజింతునని భీష్మప్రతిజ్ఞ చేసెను. ఇట్టి భీషణ ప్రతిజ్ఞ వలన ఇతనికి భీష్ముడను పేరు కలిగెను. తన తండ్రి సుఖమునకై మానవ మాత్రునకు మోహకారకమగు స్త్రీ సుఖమును, రాజ్యసుఖమును శాశ్వతముగా త్యజించెను. దీనితో మిక్కిలి ప్రసన్నుడైన ఇతని తండ్రి శంతనుడు నీ ఇచ్చ లేకుండా మృత్యువు కూడా నిన్ను కబళింపజాలదు అను వరమును ప్రసాదించెను. ఇతను ఆజన్మబ్రహ్మచారి, అత్యంత తేజస్వి, శస్త్రశాస్త్రములను రెండింటిని పూర్ణముగ నెరిగిన పారదర్శి, అనుభవజ్ఞుడు, మహాజ్ఞాని, గొప్పవీరుడు, దృఢనిశ్చయసంపన్నుడగు మహాపురుషుడు. ఈతనిలో శౌర్యము, వీర్యము, త్యాగము, తితిక్ష, క్షమ, దయ, శమము, దమము, సత్యము, అహింస, సంతోషము, శాంతి, బలము, తేజస్సు, న్యాయప్రీతి, నమ్రత, ఉదారత, లోకప్రియత్వము, స్పష్టవాదము, సాహసము, బ్రహ్మచర్యము, విరతి, జ్ఞానము, విజ్ఞానము, మాతృపితృభక్తి, గురుసేవాది సకల సద్గుణములు పరిపూర్ణముగ వికసించియుండెను. ఇతని జీవితము భగవద్భక్తిచే ఓతప్రోతమై యుండెను. శ్రీకృష్ణుని స్వరూప తత్వములను చక్కగా గుర్తెరిగినవాడు. ఇతడు పరమ నిష్ఠా పరిపూర్ణ శ్రద్ధాసంపన్నుడు. శ్రీకృష్ణ భగవానునికి పరమ భక్తుడు. మహాభారత ఆహవరంగమునందు ఇతనితో సముడైన వీరుడెవ్వడునూ లేడు. ఇతడు దుర్యోధనుని ఎదుట ‘ నేను పంచపాండవుల నెన్నడును సంహరింపను. కాని ప్రతిదినము పదివేలమంది యోధులను వధింతును’ అని ప్రతినబూనెను. భీష్ముడు కౌరవపక్షమునకు సేనాధ్యక్షుడై పది దివసములపర్యంతము భయంకరమైన యుద్ధమును జేసెను. తదనంతరము అంపశయ్యపై చేరి అందరకును జ్ఞానోపదేశము జేసి ఉత్తరాయణము ప్రవేశించిన మీదట తన ఇచ్చతో దేహమును త్యజించెను.

కర్ణుడు కుంతీదేవి పుత్రుడు. సూర్యుని అనుగ్రహమున కుంతీదేవి కన్యగా నున్నప్పుడే ఇతడు జననమందెను. అప్పుడితనిని ఒక మందసమునందు భద్రపరచి కుంతీదేవి నదిలో వదిలివేసెను. కాని భాగ్యవశమున ఇతడు మరణింపలేదు. ఆ మందసము నీటిలో కొట్టుకొనిపోయి హస్తినాపురమును జేరెను. అధిరథుడు అను పేరుగల సూతుడు ఆ బాలుని తన ఇంటికి కొనిపోయెను. అతని పత్నియగు రాధ కర్ణుని పెంచి పోషించెను. అప్పటినుండి ఇతడు రాథేయుడను పేరుతో వారి పుత్రునిగానే వ్యవహరింపబడెను. సహజకవచకుండలములతో జన్మించినందున అధిరథుడు ఈ బాలునకు ‘వసుషేణుడు’ అని నామకరణము గావించెను.ఇతడు శస్త్ర, శాస్త్రములయందు అభిజ్ఞుడు. అనుభవజ్ఞుడు, ఏలనన ఇతడు ద్రోణాచార్యుని యొద్దను, పరశురాముని యొద్దను శస్త్రాస్త్ర విద్యలనభ్యసించెను. శస్త్రవిద్యలయందును యుద్ధకళలయందును ఇతడు అర్జునునితో సమానుడు. దుర్యోధనుడు కర్ణుని అంగదేశమునకు రాజుగా జేసెను. దుర్యోధనునితో ఇతనికి ప్రగాఢమైన మైత్రి ఉండెడిది. కర్ణుడు తన తనువుతో, మనసుతో ఎల్లప్పుడూ దుర్యోధనుని హితమునందే నిరతుడై యుండెడివాడు. చివరకు తన తల్లి కుంతీదేవియు, శ్రీకృష్ణభాగవానుడును ఎంతనచ్చజెప్పినను ఇతడు దుర్యోధనుని వీడి పాండవపక్షమును జేరుటకు సమ్మతింపలేదు. ఇతని దానశీలత అద్వితీయము, ఎల్లప్పుడు ఇతడు సూర్యభగవానుని ఉపాసించెడివాడు. అట్టి తరి ఎవరేమి అర్థించినను సంతోషముతో ఇచ్చెడివాడు. ఒకనాటి ఉదయము దేవతలరాజగు ఇంద్రుడు అర్జునుని హితము గోరి బ్రాహ్మణ వేషమును ధరించి కర్ణునియొద్దకు వెళ్లి ఆతని సహజ కవచకుండలములను ఇమ్మని కోరెను. అప్పుడతడు ఎంతయో ప్రసన్నుడై తక్షణమే తన కవచ కుండలములను తీసి ఇచ్చెను. దానికి బదులుగా ఇంద్రుడు అతనికి ‘వీరఘాతిని’ యను ఒక అమోఘ శక్తిని ప్రసాదించెను. కదనమునందు కర్ణుడు ఈ శక్తినే ప్రయోగించి భీమసేసుని కుమారుడగు వీరఘటోత్కచుని వధించెను. ద్రోణాచార్యుని తర్వాత మహాభారత యుద్ధము నందు రెండు దినముల పాటు ప్రధానసేనాపతిగా నుండి అర్జునునిచే ఈతడు నిర్జింపబడెను.

కృపాచార్యుడు గౌతమవంశీయుడగు శరద్వాను మహర్షి కుమారుడు. ధనుర్విద్యయందు ఆరితేరినవాడు. అనుభవజ్ఞుడు. ఈతని సోదరి పేరు ‘కృపి’. శంతను మహారాజు కృపతో వీరిని పెంచి పెద్దజేసెను. అందుచే ఇతడు ‘కృపుడు’ అనియు, ఈతని సోదరి ‘కృపి’ యనియు పేరొందిరి. ఇతడు వేదశాస్త్రపారంగతుడు, ధర్మాత్ముడు, సద్గుణ సంపన్నుడు, సదాచారుడు, ద్రోణాచార్యునికంటెను ముందుగ కౌరవ పాండవులకును, యాదవులకును ధనుర్విద్యలను నేర్పుచుండెడి వాడు. సమస్త కౌరవవంశము నాశనమైనను ఇతడు జీవించియే యుండెను. అనంతరము పరీక్షిత్తునకు అస్త్రవిద్యను నేర్పెను. ఇతడు గొప్పవీరుడు. ఎదుటి పక్షమును జయించుటలో కడునేర్పరి. అందుచేతనే ఇతని పేరుతో పాటు ‘సమితింజయః’ అను విశేషణము చేర్చబడినది.

అశ్వత్థామ ద్రోణాచార్యుని ఆత్మజ్ఞుడు. శస్త్రాస్త్ర విద్యలయందు అత్యంత నిపుణుడు. యుద్ధకళా ప్రవీణుడు. గొప్ప వీరుడు, శూరుడు, మహారథుడు. ఈతడు తన తండ్రియగు ద్రోణాచార్యుల యొద్దనే యుద్ధవిద్య నభ్యసించెను.

ధృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో నొకడు వికర్ణుడు. ఇతడు బహుధర్మాత్ముడు, వీరుడు, మహారథుడు. కౌరవరాజ్యసభలో అత్యాచారమునకు గురియైన ద్రౌపది సభలో నున్నవారిని ‘నేను నిజముగా ఓడబడితినా?’ అని ప్రశ్నించెను. అప్పుడు విదురుడు తప్ప తక్కిన సభాసందులందరు మౌనము వహించిరి. వారిలో వికర్ణుడొక్కడే నిండు సభయందు నిలబడి త్రీవపదజాలముతో న్యాయమునకు, ధర్మమునకు అనుకూలముగా ద్రౌపదిప్రశ్నకు తగు సమాధానము నీయకుండుట గొప్ప అన్యాయమనియు, ద్రౌపదిని మనము గెలవలేదనియు తన అభిప్రాయమును సుస్పష్టముగా ప్రకటించెను.

సోమదత్తుని పుత్రుడగు భూరిశ్రవునే ‘సోమదత్తి’ అని యందురు. ఇతడు శంతనుని జ్యేష్ఠసోదరుడగు బాహ్లీకుని పౌత్రుడు. ఇతడు గొప్ప ధర్మాత్ముడు, యుద్ధకళాకోవిదుడు, శూరుడు, వీరుడు, మహారథుడు, గొప్ప దక్షినలతో కూడిన అనేక యజ్ఞములు చేసెను. ఇతడు మహాభారతయుద్ధము నందు సాత్యకిచే నిహతుడయ్యెను.

అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు కూడా కృపాచార్యునితో సరిసమానులైన సంగ్రామ విజయులని తెల్పుట కొరకే ఈ రెండు అవ్యయములు ప్రయోగింపబడినవి.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top