భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము – ఇరవై ఆరవ శ్లోకము

తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ ।
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ।
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి ॥

అథ = తరువాత
పార్థః = అర్జునుడు
తత్ర = అచట (ఆ)
ఉభయోః = ఉభయపక్షముల
సేనయోః అపి = సేనలయందును
స్థితాన్ = నిలిచియున్న
పితౄన్ = పినతండ్రులను, పెదతండ్రులను
పితామహాన్ = తాత ముత్తాతలను
ఆచార్యాన్ = గురువులను
మాతులాన్ = మేనమామలను
భ్రాతౄన్ = సోదరులను
పుత్రాన్ = పుత్రులను
పౌత్రాన్ = మనుమలను
తథా = అట్లే
సఖీన్ = మిత్రులను
శ్వశురాన్ = పిల్లనిచ్చిన మామలను
సుహృదః, చ ఏవ = మొదలగు ఆత్మీయులను అందరిని
అపశ్యత్ = చూచెను

తాత్పర్యం :-

పిమ్మట ఆ ఉభయసేనలయందును చేరియున్న తన పెదతండ్రులను, పినతండ్రులను, తాతముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులను పార్థుడు చూచెను.

భగవానుని ఆజ్ఞను అనుసరించి అర్జునుడు ఉభయసేనలలో గల సమస్త సర్వజనులను వీక్షించెను. వారిలో భూరిశ్రవాది పినతండ్రులు, పితృసమానులగువారును ఉండిరి. భీష్ముడు, సోమదత్తుడు, బాహ్లీకుడు మొదలగు పితామహులు, ప్రపితామహులును ఉండిరి. ద్రోణాచార్య, కృపాచార్యాది గురుజనులు, పురుజిత్తు, కుంతిభోజుడు, శల్యుడు ఆదిగాగల మామలు ఉండిరి. అభిమన్యుడు, ప్రతివింధ్యుడు, ఘటోత్కచుడు, లక్ష్మణుడు ఆదిగా గల తన, తన సోదరపుత్రులును ఉండిరి. ఇక అర్జునునకు వరుసకు పౌత్రు (మనుమ)లగు లక్ష్మణాదుల కుమారులును ఉండిరి. తనతో కూడియాడిన మిత్రులు, సఖులును గలరు. ఇంకను ద్రుపదుడు, శైబ్యుడు మొదలగు మామలునూ ఉండిరి. ఇంతియే గాక, ఎల్లప్పుడూ అర్జునుని శుభమును గోరు పెక్కుమంది సహృదయులును ఉండిరి.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top