భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము – ముప్పది ఆరవ శ్లోకము

నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన ।
పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ॥

జనార్దన! = ఓ జనార్దనా!
ధార్తరాష్ట్రాన్ = ధృతరాష్ట్ర కుమారులను
నిహత్య = చంపినచో
నః = మనకు
కా, ప్రీతిః స్యాత్? = ఎట్టి సంతోషము కలుగును?
ఏతాన్ = ఇట్టి (ఈ)
ఆతతాయినః = ఆతతాయులను (దుష్టులను)
హత్వా = చంపుటవలన
అస్మాన్ = మనలను
పాపమ్ ఏవ ఆశ్రయేత్ = పాపమే చుట్టుముట్టును

తాత్పర్యం :-

ఓ జనార్దనా! ఈ ధార్తరాష్ట్రులను చంపి, మనము బావుకొనునది ఏమి? (మనము మూట కట్టుకొనునది యేమి?) ఈ ఆతతాయులను చంపుటవలన మనకు పాపమే కలుగును.

వేదనిర్దేశము ననుసరించి ఆరు రకముల దుర్మార్గులు కలరు. వారే

  1. విషము పెట్టువాడు
  2. ఇంటికి నిప్పు పెట్టువాడు
  3. మారణాయుధములతో దాడి చేయువాడు
  4. ఇతరుల ధనమును దోచెడివాడు
  5. ఇతరుల స్థలము నాక్రమించెడివాడు
  6. పరుల భార్యను చెరపట్టెడివాడు

అట్టి దుర్మార్గులను శీఘ్రమే సంహరింపవలెను. వారి సంహారముచే ఎట్టి పాపము కలుగదు. అట్టి దుర్మార్గుల వధ సామాన్య వ్యక్తికైనను సరియైన కార్యమే. కాని అర్జునుడు సామాన్యవ్యక్తి కాడు. సాధుస్వభావమును కలిగియున్న కారణమున వారి యెడ అతడు సాధుస్వభావమున వర్తించదలచెను. అయినను అటువంటి సాధువర్తనము క్షత్రియునకు సంబంధించినది కాదు. రాజ్యమును పాలించు బాధ్యతాయుతుడైన రాజు సాధుస్వభావమును కలిగియుండవలెను గాని పిరికివాడై యుండకూడదు. ఉదాహరణమునకు శ్రీరామచంద్రుడు సాధుస్వభావమును కలిగియుండెను. కనుకనే నేటికిని జనులు రామరాజ్యమున వసింపవలెనని తహతహలాడుచున్నారు. శ్రీరాముడు ఎన్నడును పిరికితనమును ప్రదర్శింపలేదు. సీతాదేవిని అపహరించి రావణుడు రాముని యెడ దుర్మార్గతను ప్రదర్శించెను. అప్పుడు శ్రీరాముడు ప్రపంచచరిత్రలో అసమానమైన విధముగా అతనికి గుణపాఠము చెప్పెను. కాని అర్జునుని విషయమున దుర్మార్గముగా ప్రవర్తించినవారు అతని తాత, గురువు, స్నేహితులు, బంధువులు, పుత్రులు, మనుమలు మొదలైన అతని బంధువర్గము వారే. కనుకనే సాధారణ దుర్మార్గుల యెడ చూపవలసినటువంటి తీవ్రచర్యను తాను వారి యెడ తీసికొనరాదని అర్జునుడు భావించెను. అదియును గాక సాధువులైనవారు క్షమాగుణమును కలిగియుండవలెనని తెలియజేయబడుచున్నది. సాధువులైన వారికి అట్టి నిర్దేశములు రాజకీయ అత్యవసర పరిస్థితుల కన్నను అత్యంత ముఖ్యమైనవి. స్వజనమును రాజకీయ కారణములచే చంపుటకు బదులు వారిని ధర్మము మరియు సాధువర్తనముల దృష్ట్యా క్షమించుటయే ఉత్తమమని అర్జునుడు భావించెను. కనుకనే ఆశ్వాశ్వతమైన దేహసౌఖ్యము కొరకు అట్టి సంహారము లాభదాయకము కాదని అతడు తలచెను. అట్టి కార్యము ద్వారా లభించు రాజ్యము మరియు సౌఖ్యము శాశ్వతము కానప్పుడు తాను తన జీవితమును మరియు నిత్యమైన ముక్తిని స్వజన సంహారము ద్వారా ఏల పణముగా పెట్టవలెను? అర్జునుడు శ్రీకృష్ణుని ఇచ్చట “మాధవ” యని సంబోధించుట యందు ఒక ప్రాముఖ్యత కలదు. అంత్యమున అశుభమునే కలుగజేయు కార్యమునందు తనను శ్రీకృష్ణుడు నియుక్తుని చేయరాదని అర్జునుడు ఆ దేవదేవునికి తెలియజేయగోరెను. అయినను వాస్తవమునకు శ్రీకృష్ణభగవానుడు ఎవ్వరికిని అశుభములను కలుగజేయుడు. అట్టి యెడ తన భక్తులకు అట్టి పరిస్థితులను కలిగించడని వేరుగా తెలుపనవసరము లేదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top