భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - ముప్పది ఎనిమిదవ, ముప్పది తొమ్మిదవ శ్లోకము

యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః ।
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ॥

కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ ।
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ॥

యద్యపి = ఒకవేళ
లోభోపహతచేతసః = రాజ్యలోభముచే చెడిన మనస్సులు గల
ఏతే = ఈ దుర్యోధనాదులు
కులక్షయకృతమ్ = వంశనాశము వలన కలుగు
దోషమ్ చ = దోషమును
మిత్రద్రోహే = మిత్రద్రోహ కారణముగా
పాతకమ్ చ = పాపమును
న పశ్యంతి = చూడకున్నవారైనను
జనార్దన! = ఓ జనార్దనా
కులక్షయ కృతమ్ = కులనాశము వలన కలుగు
దోషమ్ = దోషమును
ప్రపశ్యద్భిః = చక్కగా తెలిసికొనుచున్న
అస్మాభిః = మన చేత
అస్మాత్ = ఇట్టి
పాపాత్ = పాపమునుండి
నివర్తితుమ్ = తొలగుటకు
కథమ్ = ఏల
న జ్ఞేయమ్ = ఆలోచింపరాదు?

తాత్పర్యం :-

ఓ కృష్ణా! రాజ్యలోభముచే భ్రష్ట చిత్తులైన దుర్యోధనాదులు వంశనాశనము వలన కలుగు దోషమును, మిత్రద్రోహము వలన కలుగు పాపమును ఒకవేళ యెరుగకున్నను, ఆ రెండిటిని బాగుగ తెలిసినట్టి మన మేల యీ పాపకృత్యము నుండి విరమింపగూడదో అర్థము కాకున్నది.

దుర్యోధనాదుల ఈ దుష్కార్యములు పూర్తిగా అనుచితమైనవి అనుట వాస్తవము, వారి చేష్టలు వింతగొల్పునవి కావు. ఏలనన దురాశ వలన వారు వివేకభ్రష్టులైరి. అందువలన కులనాశనముచే కలుగు అనర్థములను వారు ఊహింపలేకున్నారు. దాని దుష్పరిణామములను తెలియలేకున్నారు. ఉభయ సైన్యములలో చేరియున్న సోదరులలో, బంధువులలో, మిత్రులలో పరస్పర వైరము కల్పించి ఒకరినొకరు హతమార్చుకొనునట్లు చేయుట ఎంతటి భయంకర మహాపాపమో వారి బుద్ధికి అందకున్నది. కాని మేము వారివలె లోభముతో అంధులము కాలేము కదా! కులనాశము వలన కలిగెడు దోషములను బాగుగా తెలియుదుము. కాన తెలిసి తెలిసి ఇంతటి ఘోరపాపమునకు ఎట్లు ఒడిగట్టుదుము? కాబట్టి బాగుగా ఆలోచించి మనము దీనినుండి బయటపడవలయును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top