భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - నలుబై రెండవ శ్లోకము

సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ ।
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ॥

సంకరః = వర్ణసాంకర్యము
కులఘ్నానామ్ చ = కులఘాతకులకును
కులస్య = కులమునకును
నరకాయ ఏవ = నరకప్రాప్తియే అగును
లుప్తపిండోదక క్రియాః = ఆహారము, నీరు, కర్మలు లోపించిన
ఏషామ్ = వీరి యొక్క
పితరః హి = పితరులు కూడ
పతంతి = అధోగతి పాలయ్యెదరు

తాత్పర్యం :-

అవాంఛిత సంతానము వృద్ధియగుట వలన కుటుంబమువారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరిచిన వారు ఇరువురికిని నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనము నొందుదురు.

కర్మకాండ విధుల ప్రకారము వంశపితరులకు నియమానుసారముగా పిండోదకములు అర్పించవలసిన అవసరం ఉన్నది. అట్టి అర్పణము విష్ణువు యొక్క అర్చనము ద్వారా చక్కగా ఒనరింపబడగలదు. ఏలయన విష్ణువునకు అర్పించిన ఆహారమును భుజించుటయనెడి కార్యము మనుజుని అన్ని రకములైన పాపముల నుండి ముక్తున్ని చేయగలదు. కొన్నిమార్లు వంశపితరులు పలువిధములైన పాపకర్మల కారణమున తపించుచుండవచ్చును. ఇంకొన్ని మార్లు వారికి స్థూలదేహము సైతము లభింపక పిశాచములుగా సూక్ష్మదేహమునందే బలవంతముగా నిలువవలసివచ్చును. కానీ వంశీయులచే భగవత్ప్రసాదము ఆ పితరులకు అర్పించబడినపుడు వారు పిశాచరూపములనుండి మరియు ఇతర దుర్భర జీవన స్థితుల నుండి విడుదలను పొందగలరు. పితరులకు ఒనర్చబడెడి అట్టి సహాయము వాస్తవమునకు ఒక వంశాచారము. భక్తియుతజీవనము నందు నిలువని వాడు అటువంటి కర్మకాండను తప్పక ఒనరింపవలెను. కాని భక్తియుత జీవనము నందు నిలిచిన వాడు అట్టి కర్మలను ఒనరించవలసిన అవసరము లేదు. కేవలము భక్తియుక్త సేవను నిర్వహించుట ద్వారా మనుజుడు లక్షలాది పితృదేవతలనైనను సర్వవిధములైన దుఃఖముల నుండి ముక్తులను చేయగలడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top