భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - మూడవ శ్లోకము

పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ ।
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ॥

ఆచార్య = ఓ గురువరా!
తవ = నీ యొక్క
ధీమతా = బుద్ధిమంతుడును
శిష్యేణ = శిష్యుడునుఅగు
ద్రుపదపుత్రేణ = ద్రుపదపుత్రుని (దృష్టద్యుమ్నుని)చే
వ్యూఢామ్ = వ్యూహాకృతిలో నిలుపబడిన
పాండు పుత్రాణామ్ = పాండవుల యొక్క
ఏతామ్ = ఈ
మహతీమ్ = గొప్పదియైన
చమూమ్ = సైన్యమును
పశ్య = చూడుము

తాత్పర్యం :-

ఓ ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిష్యుడును, ద్రుపదపుత్రుడును అయిన ధృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిల్పబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు.

గురువుగారూ! నమస్కారం. ఒకసారి పాండవుల వైపు ఉన్న సేనాసముద్రాన్ని చూడండి. ఆ సైన్యం ముందు ఠీవిగా నిలబడి ఉన్న పాండవుల సర్వ సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుని చూడండి. ఆయన ఎవరో కాదు! తమరి శిష్యుడే. తమరే అతనికి విలువిద్య నేర్పించారు. తమరే దృష్టద్యుమ్నుని మహా బుద్ధిమంతుడు అని పొగిడేవారు. కాని ఆచార్య! ఆయన మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడు అని మరిచిపోకండి. మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక, కేవలం మిమ్మల్ని చంపడానికే తపస్సుచేసి, దృష్టద్యుమ్నుని కుమారుడిగా పొందాడు. దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు, బుద్ధిమంతుడు అని ఉపేక్షచేస్తారో, మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడనీ, మిమ్మల్ని చంపడానికే పుట్టాడనీ అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో, మీ ఇష్టం అనే అర్థం వచ్చేటట్టు నర్మగర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు. తన రాజకీయ చతురతనంతా ఇక్కడ మాటల్లో చూపించాడు దుర్యోధనుడు.

దుర్యోధనుని పక్షాన 11 అక్షౌహిణిల సైన్యం ఉంది. పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణిల సైన్యం మాత్రమే ఉంది. కాని పాండవుల పక్షాన ధర్మము, ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు. కాని దుర్యోధనుడి పక్షాన అధర్మం ఉంది. భీముడికి బాలుడుగా ఉండగానే విషం పెట్టాడు. వారిని లక్క ఇంట్లోపెట్టి సజీవదహనం చేయాలని చూచాడు. అక్రమంగా పాండవుల రాజ్యం లాక్కోవడమే కాక, వారి భార్యను అవమానించాడు. అడవులకు పంపాడు. తిరిగి వచ్చి వారు తమ రాజ్యం తమకు ఇమ్మని అడిగితే సూదిమొన మోపినంత భూమికూడా ఇవ్వను అన్నాడు. ఇవన్నీ అధర్మాలనీ, అధర్మం తన పక్షాన ఉందనీ దుర్యోధనుడికి తెలుసు. అందుకే దుర్యోధనుడు అభద్రతా భావంతో ఉన్నాడు. తమ కంటే చిన్నదైన పాండవుల సైన్యం పెద్దభూతంలాగా కనపడుతూ ఉంది. అందుకే “మహతీంచమూమ్” అంటే గొప్పదైన పాండవుల సైన్యం చూడండి అని అన్నాడు. మనలో కూడా ఎంత ఎక్కువ ధనం, ఆస్తి, పదవులు ఉంటే అంత అభద్రతా భావం ఉంటుంది. ముందు వెనుక సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు. ప్రతి చిన్న విషయానికీ భయపడతాడు. ఏమీ లేని వాడు నిర్భయంగా, హాయిగా కులాసాగా ఒంటరిగా తిరుగుతాడు. అందుకనే ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ సుయోధనుడికి అభద్రతాభావం పోలేదు.

దుర్యోధనుని మాటలతో ఒళ్ళుమండింది ద్రోణునికి. దుర్యోధనుని వంక తీక్షణంగా చూచాడు. దుర్యోధనుడు సర్దుకున్నాడు. అందరి మాదిరే దృష్టద్యుమ్నుని గురించి కూడా అడిగానే అర్థం వచ్చేటట్టు ఇతర వీరుల గురించి ఇలా అన్నాడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top