భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము – ముప్పది నాలుగవ శ్లోకము

ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః ।
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ॥

ఆచార్యాః = గురువులు
పితరః = పినతండ్రులు, పెద్దతండ్రులు
పుత్రాః చ = కుమారులును
తథా ఏవ = అట్లే
పితామహాః = తాతలు
మాతులాః = మేనమామలు
శ్వశురాః = పిల్లనిచ్చిన మామలు
పౌత్రాః = మనుమలు
శ్యాలాః = బావమరిదులు
తథా, సంబంధినః = అట్లే (ఇతర) బంధువులు (చేరియున్నారు)

తాత్పర్యం :-

గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరిదులు, ఇతర బంధువులు మొదలగువారు అందరును ఇచ్చటికి చేరియున్నారు.

ఆచార్యులు, పెద్దతంద్రులు, పినతండ్రులు మొదలగుగా గల బంధువులను గూర్చి తొలుతనే సంక్షేపముగా చెప్పియుండెను. ఇచ్చట ‘శ్యాలాః’ అను పదముచే దృష్టద్యుమ్నుడు, శిఖండి, సురథుడు ఇత్యాదులను, అట్లే ‘సంబంధినః’ అనుటచే జయద్రథాదులను గుర్తుచేసి – ఈ ప్రపంచమున మనుజుడు తనకు ప్రియమైన బంధువుల కొరకే ఈ భోగముల నన్నిటిని కోరుచుండును. వీరే చంపబడినప్పుడు రాజ్యభోగముల ఉపలబ్దివలన ప్రయోజనమేమి? అట్టి రాజ్యభోగములు దుఃఖ కారణములే యగునుకదా! అని అర్జునుడు చెప్పదలచెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top