భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము – ఇరవై ఐదవ శ్లోకము

సంజయ ఉవాచ
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ ।
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ॥

భీష్మ = భీష్మపితామహుడు
ద్రోణ = గురువైన ద్రోణుడు
ప్రముఖతః = సమ్ముఖమున
సర్వేషాం = అందరు
చ = కూడా
మహీక్షితాం = భూపాలకులు
ఉవాచ = పలికెను
పార్థ = ఓ పృథాకుమారా
పశ్య = చూడుము
ఏతాన్ = వారందరిని
సమవేతాన్ = కూడిన
కురూన్ = కురువంశీయులను
ఇతి = ఆ విధముగా

తాత్పర్యం :-

భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున శ్రీకృష్ణుడు "ఓ పార్థా! ఇచ్చట కూడియున్నటువంటి కురువంశీయులందరిని గాంచుము" అని పలికెను.

సకల జీవుల యందున్న పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుని మనస్సులోని ఆలోచనలను అవగతము చేసికొనగలిగెను. ఈ సందర్భమున ఉపయోగింపబడిన హృషీకేశుడు అనెడి పదము ఆ దేవదేవుడు సమస్తము నెరుగునని సూచించుచున్నది. పార్థా అనెడి పదము సైతము అర్జునుని విషయమున ప్రాధాన్యమును కలిగియున్నది. పృథా తనయుడు కనుకనే తాను సారథి యగుటకు అంగీకరించితినని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు మిత్రునిగా తెలియజేయగోరెను. ఇక “కురువంశీయులను గాంచుము” అని అర్జునునితో శ్రీకృష్ణుడు పలుకుటలో ఉద్దేశ్యమేమి? యుద్దమును అచ్చటనే నిలిపివేయవలెనని అర్జునుడు కోరెనాయేమి? తన మేనత్త కుమారుడైన అర్జునుని నుండి అట్టి విషయమును శ్రీకృష్ణుడు ఎన్నడును ఊహించియుండలేదు. ఈ విధముగా అర్జునుని మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్యధోరణిలో దర్శించెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top