భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - పదిహేడవ శ్లోకము, పద్దెనిమిదవ శ్లోకము

కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః ।
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ॥

ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే ।
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ॥

పృథివీపతే = ఓ రాజా!
పరమేష్వాసః = శ్రేష్ఠమైన ధనుస్సుగల
కాశ్యః చ = కాశీరాజును
మహారథః = మహారథుడైన
శిఖండీ చ = శిఖండియును
ధృష్టద్యుమ్నః చ = దృష్టద్యుమ్నుడును
విరాటః చ = విరాటరాజును
అపరాజితః = అజేయుడైన
సాత్యకిః = సాత్యకియు
ద్రుపదః చ = ద్రుపదమహారాజును
ద్రౌపదేయాః చ = ద్రౌపదియొక్క కుమారులు ఐదుగురును
మహాబాహుః = గొప్ప బాహువులు గలవాడైన
సౌభద్రః = అభిమన్యుడును
సర్వశః = అన్నివైపులనుండి
పృథక్-పృథక్ = వేర్వేరుగా
శంఖాన్ = శంఖములను
దధ్ముః = పూరించిరి

తాత్పర్యం :-

ఓ రాజా! మహాధనుర్ధారియైన కాశీరాజు, మహారథుడైన ‘శిఖండి’యు, దృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపదమహారాజు, ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులును, భుజబలశాలియు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడు తమ తమ శంఖములను వేర్వేరుగాపూరించిరి.

శిఖండి మరియు దృష్టద్యుమ్నుడు అను ఇరువురునూ ద్రుపదమహారాజు కుమారులు. శిఖండి జ్యేష్ఠుడు, దృష్టద్యుమ్నుడు కనిష్టుడు. పూర్వము ద్రుపద మహారాజునకు సంతానము లేకుండెను. అప్పుడాతడు సంతానమునకై ఆశుతోషుడగు శ్రీశంకరభగవానుని ఉపాసించెను. శంకరుడు ప్రసన్నుడైన మీదట రాజు ఆతనిని సంతానమునకై అర్థించెను. అంతట శివుడు – ‘నీకొక కుమార్తె కలుగగలద’ ని వరము నొసగెను. ద్రుపదుడంతట – ‘భగవాన్! నాకు కుమార్తె వలదు. నాకొక పుత్రుని ప్రసాదింపు’మని వేడుకొనెను. పిమ్మట శంకరుడిట్లనెను- ఆ కన్యయే కొంతకాలమునకు పుత్రరూపమున మార్పు చెందగలదు.’ ఇట్టి వరప్రసాద ఫలస్వరూపముగా ద్రుపదుని ఇంట కన్య జన్మించినది. రాజు శివుని వచనములపై విశ్వాసముంచినవాడై ఆ కన్యను కుమారుడనియే ప్రసిద్ధిమొనర్చెను. రాణిగారు కూడా తన కుమార్తెను మరుగుపరచి వాస్తవవిషయమును ఎవరికినీ తెలియనీయలేదు. ఆ కుమార్తెకు మగవారివలె ‘శిఖండీ’ అను నామకరణము జేసి, రాజకుమారునకు తగిన దుస్తులనే ధరింపజేసి యథావిధిగా విద్యాధ్యయనము చేయించిరి. యుక్తవయసు రాగానే దశార్ణదేశాధిపుడగు హిరణ్యవర్మగారి కుమార్తెతో అతనికి వివాహము కూడా జరిగెను. హిరణ్యవర్మ కుమార్తె అత్తగారి ఇంటికి వచ్చిన పిదప శిఖండి పురుషుడు కాడని, స్త్రీయేనని తెలిసికొని మిగుల దుఃఖించి, అచటి పరిస్థితిని పూర్తిగా ఒక దాసితో తన తండ్రియగు హిరణ్యవర్మకు కబురంపెను. ఇందులకు హిరణ్యవర్మ క్రుద్ధుడై ద్రుపదునిపై దండెత్తి ఆతనిని వధించుటకు నిశ్చయించుకొనెను. ఈ వార్త నెరిగిన ద్రుపదుడు యుద్ధమునుండి రక్షించుకొనుటకై దైవారాధన చేయసాగెను. ఇక పురుషవేషధారియైన ఆ కన్యక తన కారణముగా తండ్రికి కలిగిన భయంకరమగు విపత్తును గాంచి ఎంతగానో దుఃఖించి ప్రాణత్యాగము జేయ నిశ్చయించుకొని గుట్టుచప్పుడు కాకుండా గృహమును వదలి వెడలిపోయెను. అడవిలో ఆమెకు స్థూణాకర్ణుడను పేరుగల ఐశ్వర్యవంతుడగు నొక యక్షునితో పరిచయమయ్యెను. శిఖండి వృత్తాంతమును విని దయతో స్థూణాకర్ణుడు తన పురుషత్వమును అతనికిచ్చి, కొంతకాలము కొరకై అతని స్త్రీత్వమును గ్రహించెను. ఈ విధముగ శిఖండి పురుషుడాయెను. శిఖండి తిరిగి ఇంటికేగి జరిగిన వృత్తాంతమును తల్లితండ్రులకు వివరించి ఓదార్చెను. పిమ్మట మామయగు హిరణ్యవర్మకు తాను పురుషుడైన సంగతిని తెల్పి అతనిని శాంతపరిచెను. అటు పిమ్మట కుబేరుని శాపము వలన స్థూణాకర్ణుడు జీవితాంతము స్త్రీగా నుండి పోయెను. ఈ విధముగా శిఖండి శాశ్వతముగ పురుషుడై యుండిపోయెను. ఈ ఇతిహాసము నంతయు భీష్మపితామహుడెరిగి యుండెను. అందుచే అతడు శిఖండిపై శస్త్రప్రహారము చేయకుండెను. శిఖండికూడా గొప్ప శూరుడు, వీరుడైన మహారథుడు. ఈతనిని ముందుంచుకొని అర్జునుడు – భీష్మపితామహుని నెలగూల్చెను.

‘సర్వశః’ అను శబ్దముతో – శ్రీకృష్ణుడు, పాండవులు ఐదుగురు, కాశీరాజు మొదలగు ప్రధానవీరులు, అంతేగాక పాండవ సైన్యమునందలి ఎందరో రథికులు, మహారథులు, అతిరథులగు వారందరునూ తమ తమ శంఖములను పూరించినారని సంజయుడు సూచించెను. ఇదియే ఇందుగల ప్రత్యేకాంశము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top