భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము – ఇరవై ఏడవ శ్లోకము

తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ ।
కృపయా పరయాఽవిష్టో విషీదన్నిదమబ్రవీత్ ॥

అవస్థితాన్ = అట్లు చేరియున్న
తాన్ = వారైన
సర్వాన్ బంధూన్ – బంధువులందరిని
సమీక్ష్య = పరికించి
సః కౌంతేయః = కుంతీపుత్రుడైన అర్జునుడు
పరయా కృపయా = మిక్కిలి కనికరముతో
ఆవిష్టః = కూడినవాడై
విషీదన్ = శోకించుచు
ఇదమ్ = ఈ వచనమును
అబ్రవీత్ = పలికెను

తాత్పర్యం :-

సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరిని చూచి, కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణాసమంచితుడై శోకసంతప్తుడై ఇట్లు పలికెను.

అర్జునుడు తన తండ్రులను, తాతలను, ఇంకా అనేకులనుగూర్చి చెప్పియుండెను. వారేగాక, దృష్టద్యుమ్నుడు, శిఖండి, సురథుడు మున్నగు బావమరదులను, జయద్రథాది భావలను, ఇతరులకు బంధువులను, సర్వజనులను ఇరు సేనలయందు గల వారినందరిని సూచించుటకే సంజయుడు ‘ఉపస్థితులైన బంధువులనందరినీ’ అని పల్కెను.
అర్జునుడు నలువైపులనున్న స్వజనసముదాయమును గాంచి, ఈ యుద్ధమునందు వీరందరునూ సంహరింపబడుదురని తలచుకొనినప్పుడు బంధుప్రీతి కారణమున అతని హృదయము చలించినది. అప్పుడాతనిలో యుద్ధవిముఖత, కారుణ్యజనితమైన పిరికితనము ప్రబలములైనవి. ‘అత్యంత కరుణ’ అనగా నిదియే. దీనినే సంజయుడు ‘పరయా కృపయా’ అని తెల్పెను. ఈ పిరికితనమునకు లోనైన అర్జునుడు తన క్షత్రియోచితమగు వీరస్వభావమును మరచి, మిక్కిలి మొహవశుడయ్యెను. అతడు మిక్కిలి జాలితో కూడిన వాడయ్యె ననుటలో గల ఆంతర్యమిదియే.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top