భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - మొదటి శ్లోకము

ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।
మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ॥

సంజయా = ఓ సంజయా
ధర్మక్షేత్రే = ధర్మక్షేత్రమైన
కురుక్షేత్రే = కురుక్షేత్రమునందు
సమవేతాః = చేరియున్నవారును
యుయుత్సవః = యుద్ధకాంక్షగలవారును (యుద్ధసన్నద్ధులైయున్నవారును) అగు
మామకాః = నా వారు
చ = మరియు
పాండవాః = పాండుకుమారులు
ఏవ = కలిసి
కిమ్ = ఏమి
అకుర్వత = చేసిరి

తాత్పర్యం :-

ధృతరాష్ట్రుడు పలికెను – ఓ సంజయా! యద్ధసన్నద్ధులై ధర్మక్షేత్రమున కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును పాండు పుత్రులును ఏమి చేసిరి?

‘ధర్మ’ శబ్దముతో గీత ప్రారంభమైనది. అది మంగళవాచకము. ధర్మమను పదమును మొట్టమొదట ప్రయోగించుటద్వారా శ్రీ వ్యాసమహర్షి గీతకు మంగళాచరణమును గావించినవాడాయెను. ఏలయనిన, భగవానుడు ధర్మస్వరూపుడు. ధర్మశబ్దోచ్చారనముచే భగవన్నామమునే వ్యాసులు కీర్తించినట్లైనది. గీతాగ్రంథము యొక్క లక్ష్యము, సారాంశము ఈ మొదటి పదమనందే తెల్చివేయబడెను. అదియే ధర్మము. అట్టి ధర్మోద్ధరణము కొరకే లోకమున భగవంతుడు అవతరించుచుండును. ధృతరాష్ట్రుడు అనగా రాష్ట్రమును ధరించినవాడు అని అర్థము. తనది కాని రాష్ట్రమును తనదని భావించేవాడే ధృతరాష్ట్రుడు. ఈ ప్రపంచము, దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మున్నగునవి దృశ్యములు. అవి తాను గాదు. దృక్కగు ఆత్మయొకటియే తానుగాని, దేహాది దృశ్యపదార్థములుకాదు. కాని అజ్ఞాని తనదికానట్టి అనగా ఆత్మేతరమైనట్టి దేహాది దృశ్యరూప రాష్ట్రమును తనదిగా దలంచి దానిపై మమత్వము, అహంభావము గలిగియుండుచున్నాడు. కనుకనే ఆతడు ధృతరాష్ట్రుడు. అజ్ఞానభావముతో గూడియుండు వారందరున్ను ధృతరాష్ట్రులే యగుదురు. గీతాజ్ఞానశ్రవణముచే అట్టి అజ్ఞానరూప అంధత్వమును రూపుమాపుకొనుట ప్రతివాని యొక్క కర్తవ్యమైయున్నది.

కురుక్షేత్రము – ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. పంజాబ్ రాష్ట్రమున అంబాలా అను పట్టణమునకు దక్షిణముగను, డిల్లీపట్టణమునకు ఉత్తరముగను ఇది వెలయుచున్నది. మహాభారతమందలి వనపర్వమున 83వ అధ్యాయమునందును, శల్య పర్వమున 53వ అధ్యాయమునందును ఈ కురుక్షేత్రము యొక్క మహిమను గురించి లెస్సగ తెలుపబడియున్నది. పూర్వము బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, అగ్ని మున్నగు వరచ్చోట తపంబు సలిపియుండిరి. కౌరవులకు పాండవులకు మూలపురుషుడైన కురుమహారాజున్ను ఆ స్థలమున పెక్కు ధర్మము లాచరించి యుండెను. ఒకానొక సమయమున కురు భూపాలు డాప్రదేశమును దున్నుటచే దానికి కురుక్షేత్రమని పేరు వచ్చినది. ఆ క్షేత్రమునందు ఎవరు తపస్సు చేయుదురో, లేక మృతినొందుదురో వారుత్తమలోకములకు జనుదురని ఇంద్రుడు కురువునకు వరమిచ్చెను. పూర్వము పరశురాముడున్ను అచ్చోటనే పితృతర్పణము గావించి యుండెను. ఎందరో మహనీయులా స్థలమున పెక్కు ధర్మకార్యము లాచరించి యుండిరి. కాబట్టి అయ్యది ధర్మక్షేత్రమని పేర్కొనబడెను.

అట్టి కురుక్షేత్రమున ప్రవేశించుటవలన తత్ప్రభావముచే తన తనయులగు దుర్యోధనాదుల చిత్తమున దయాది సద్గుణము లుదయించిగాని, ధర్మరాజాదుల యందలి సహజ అహింసాది సద్గుణములు వెల్లుబికిగాని యుద్ధవిరమణమును గూర్చిన సంకల్పము లేవైన వారియందుదయించియుండునేమోయను శంకచే ధృతరాష్ట్రుడు ‘యుద్ధమున వారేమిచేసిరి?’ అని ప్రశ్నించియుండవచ్చును.

‘మామకాః’ అను పదమును తన పుత్రులగు దుర్యోధనాదుల గురించియు మరియు అతని పక్షమునందలి యోధులందరిని గురించియు ధృతరాష్ట్రుడు ప్రయోగించెను. ‘పాండవాః’ అను పదము ధర్మరాజాదులను గూర్చియు, వారి పక్షమునందలి యోధులందరిని గూర్చియు ఉద్దేశించి ప్రయోగింపబడినది. ‘సమవేతాః’ ‘యుయుత్సవః’ అను విశేషణములతో బాటు ‘కిమ్ అకుర్వత’ అనుచు ధృతరాష్ట్రుడు గడిచిన పది దినముల నుండి జరుగుచున్న భయంకరమగు యుద్ధమును గురించిన వివరముల నెరుంగగోరెను. అంతియే గాక యుద్ధమునకై ఒకచోట చేరిన వీరందరును రణమునెట్లు ప్రారంభించిరి? ఎవరు, ఎవరితో, ఎట్లు తలపడిరి? ఎవరిచే నెవరు, ఏ విధముగ, ఎప్పుడు చంపబడిరి? మొదలగు వానిని తెలిసికోనగోరెను.

భీష్మ పితామహుని పతనమువరకు భయంకర యుద్ధరంగ విశేషములను ధృతరాష్ట్రుడు వినియె యుండెను. అందువలన అతనికి ఇంతవరకును యుద్ధవర్తమానములు ఏమియు తెలివని భావింపరాదు. ధర్మక్షేత్ర ప్రభావము వలన తన పుత్రుల బుద్ధి చక్కబడి, వారు పాండవులకు వారి రాజ్యమును ఇచ్చి యుద్దమును నిలిపిరా? ధర్మరాజైన యుధిష్ఠిరుడే ధర్మక్షేత్ర ప్రభావము చేత ప్రభావితుడై రణమును విరమించెనా? ఇప్పటి వరకు ఉభయసేనలు నిలబడియేయున్నవా! యుద్ధము ఇంకనూ జరుగుచున్నదా? ఒకవేళ జరుగుచుండినచో దాని పరిణామమేమి? ఇత్యాదులను తెలిసికొనగోరెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top