భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము – ముప్పది ఏడవ శ్లోకము

తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ ।
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ? ॥

తస్మాత్ = అందువలన
మాధవ! = ఓ మాధవా!
స్వబాంధవాన్ = మన బంధువులైన
ధార్తరాష్ట్రాన్ = ధార్తరాష్ట్రులను
హంతుమ్ = హతమార్చుటకు
వయమ్ = మనము
న అర్హాః = అర్హులముకాము
హి = ఏలనన
స్వజనమ్ = స్వజనులను
హత్వా = చంపి
కథంసుఖినః = ఎట్లు? సుఖులము
స్యామ = కాగలము

తాత్పర్యం :-

కనుక ఓ మాధవా! మనబంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును?

నాకు కలిగిన పరిస్థితిని, యుద్ధము చేయకుండుటకై నేను ఇంతవరకు పలికిన పలుకులను, నా మదిలో రేకెత్తిన ఆలోచనా సరళిని కలబోసి చూడగా దుర్యోధనాది బంధువులను చంపుట మాకు సర్వథా అనుచితముగా కనబడుతున్నది. అంతియేగాక, కుటుంబమును నాశనము చేసిన మాకు ఇహ పరలోకముల యందు ఏ విధముగను, ఎట్టి సుఖమూ లభింపబోదు. అందుచే నేను యుద్ధము చేయుటకు ఇష్టపడను అని అర్జునుడు వచించుచున్నాడు.

‘స్వ, స్వ’ అని అర్జునుడు కలవరించుచున్నాడు. ‘నాది’ యను మమకారభావ మతనికి గట్టిగ పాతుకొనిపోయినది. ‘నేను, నాది’ అను ఈ రెండును జీవునకు మోక్షమార్గమున మహా ప్రతిబంధకములై యున్నవి. ఈ దేహమే నేను అని అనుకొనునంత వరకు ఇట్టి భావములు జనులను వదలలేవు. కనుకనే శ్రీకృష్ణపరమాత్మ అర్జునుని ఈ దేహాభిమానమును ‘నీవు అత్మవే కాని దేహము కాదు’ అను అఖండ జ్ఞానోపదేశము ద్వారా తొలగించివేయనున్నాడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top