భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము – ముప్పదవ శ్లోకము

గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే ।
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ॥

హస్తాత్ = చేతినుండి
గాండీవమ్ = గాండీవధనుస్సు
స్రంసతే = జారిపోవుచున్నది
చ, త్వక్ ఏవ = మరియు చర్మముగూడ
పరిదహ్యతే = తాపము నొందుచున్నది
చ, మే = అట్లే నాయొక్క
మనః = మనస్సు
భ్రమతి ఇవ = భ్రమకులోనగుచున్నట్లున్నది
అతః = అందువలన
అవస్థాతుమ్ చ = నిశ్చలముగా నిలిచి యుండుటకును
న శక్నోమి = సమర్థుడను కాకున్నాను

తాత్పర్యం :-

గాండీవము చేతినుండి జారిపోవుచున్నది. చర్మము తపించిపోవుచున్నది. మనస్సు భ్రమకు గురియైనట్లు అనిపించుచున్నది. కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను.

కారుణ్యజనితమగు పిరికితనముచే అర్జునునకు కడు శోచనీయమగు స్థితి దాపురించినది. దీనినే అర్జునుడు ఇట్లు వర్ణించుచున్నాడు – నా సర్వాంగములును దుర్బలములైనవి. గాండీవమును ఎక్కుపెట్టి సాయకమును సంధించుటకాదుగదా, కనీసము దానిని పట్టుకొని నిలువ జాలనంతగా చేతులు బలహీనములగుచున్నవి. అందుచే గాండీవము చేతినుండి జారిపోవుచున్నది. యుద్ధ భవిష్యత్పరిణామములను గురించిన తలంపు (చింత) నా మనసునందు మంటలను చెలరేపుచున్నది. చర్మముకూడా దహింపబడుచున్నది. ఇట్టి మానసికవేదనవలన నా మనసు దేనియందును క్షణకాలమైనను స్థిరముగా నిలువజాలకున్నది. తత్పలితముగా నా తల తిరిగి పోవుచున్నది. ఇప్పుడే, ఇక్కడనే నేను మూర్చితుడనై పడిపోవుదునేమో యని అనిపించుచున్నది.

అర్జునుని గాండీవము దివ్యమైనది. అది తాళ వృక్షముతో సమానమైనది. తన గాండీవమును గూర్చి పరిచయము చేయుచు బృహన్నల రూపముననున్న అర్జునుడే స్వయముగా ఉత్తరకుమారునితోనిట్లు చెప్పెను – ‘ఇది అర్జునుని జగత్ప్రసిద్ధమైన ధనుస్సు, ఇది సువర్ణఖచితమైనది. శస్త్రములలో కెల్ల శ్రేష్ఠమైనది. లక్ష ఆయుధములతో సమమైన శక్తి కలది. ఈ ధనువుచే అర్జునుడు దేవతలపై, మానవులపై విజయమును సాధించెను. విచిత్రమైన, అద్భుతమైన, కోమలమైన, విశాలమైన ఈ ధనుస్సును దేవతలు, దానవులు, గంధర్వులు దీర్ఘకాలము వరకు ఆరాధించిరి. మిక్కిలి దివ్యమైన ఈ ధనుస్సును బ్రహ్మదేవుడు ఒక వేయి వత్సరములు, ప్రజాపతి ఐదువందల మూడు సంవత్సరములు, ఇంద్రుడు ఎనభై అయిదు వర్షములు, చంద్రుడు అయిదు వందల సంవత్సరములు, వరుణుడు నూరేండ్లు తమయొద్ద నుంచుకొనిరి. దీనిని అర్జునునకు ఖాండవవనదహన సమయమున అగ్నిదేవుడు, వరుణునిచే ఇప్పించెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top