భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - నలుబై ఒకటవ శ్లోకము

అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః ।
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ॥

కృష్ణ! = ఓ కృష్ణా!
అధర్మాభిభవాత్ = అధర్మము అధికమగుటవలన
కులస్త్రియః = కులస్త్రీలు
ప్రదుష్యంతి = మిక్కిలి దూషితలగుదురు
వార్ష్ణేయ = కృష్ణా!
స్త్రీషు = స్త్రీలు
దుష్టాసు = దూషితలైనపుడు
వర్ణసంకరః = వర్ణసాంకర్యము
జాయతే = ఉత్పన్నమగును

తాత్పర్యం :-

ఓ కృష్ణా! వంశము నందు అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితలగుదురు. ఓ వృష్ణివంశ సంజాతుడా! అట్టి కులస్త్రీ పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్ధినొందును.

జీవితమునందలి శాంతికి, అభివృద్ధికి, ఆధ్యాత్మికోన్నతికి మానవసంగము నందలి సత్ప్రవర్తన కలిగిన జనులే మూలాధారము. దేశము మరియు జాతి యొక్క ఆధ్యాత్మిక పురోగతి కొరకు సంఘమునందు సత్ప్రవర్తన కలిగిన జనులు నెలకొనియుండు రీతిలో వర్ణాశ్రమధర్మములు ఏర్పాటు చేయబడినవి. అటువంటి జనబాహుళ్యము స్త్రీల ధర్మవర్తనము మరియు పాతివ్రత్యము పైననే ఆధారపడియుండును. బాలురు సులభముగా తప్పుదారి పట్టుటకు అవకాశమున్న రీతిగనే, స్త్రీలు సైతము పతనమగుటకు అవకాశము కలదు. కనుకనే పిల్లలకు మరియు స్త్రీలకు కుటుంబ పెద్దల రక్షణము అవసరము. వివిధ ధర్మాచారములందు నియుక్తులగుట ద్వారా స్త్రీలు పెడదారి పట్టకుందురు. చాణక్యపండితుని అభిప్రాయము ప్రకారము స్త్రీలు సాధారణముగా తెలివి కలవారు కానందున నమ్మకముంచ దగినవారు కారు. కనుకనే ధర్మ కార్యములకు సంబంధించిన వంశాచారములు వారికి సదా వ్యాపకమును కలిగించవలెను. ఆ విధముగా వారి పాతివ్రత్యము మరియు భక్తి వర్ణాశ్రమ పద్ధతిని పాటించుటకు యోగ్యత కలిగిన సత్ప్రజకు జన్మనొసగగలదు. అట్టి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనపుడు స్త్రీలు సహజముగా కట్టుబాటు విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలియుదురు. ఆ విధముగా అవాంఛిత జనబాహుళ్యమును వృద్ధిచేయుచు జారత్వము ప్రబలమగును. బాధ్యతారహితులైన పురుషులు కొందరు అటువంటి జారత్వమునే సంఘమున ప్రోత్సహించుచుందురు. అంతట సంఘమున అవాంఛిత సంతానము పెచ్చు పెరిగి యుద్ధములకు మరియు అశాంతికి దారితీయును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top