భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము – ముప్పది ఒకటవ శ్లోకము

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ ।
న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ॥

కేశవ! = ఓ కృష్ణా!
విపరీతాని = విపరీతములైన (అశుభసూచకములైన)
నిమిత్తాని, చ = శకునములను గూడ
పశ్యామి = చూచుచున్నాను
ఆహవే = యుద్ధమునందు
స్వజనమ్ = స్వజనసమూహమును (ఆత్మీయులను)
హత్వా = చంపి
శ్రేయః చ = (ఎట్టి) శ్రేయస్సును గూడ
న అనుపశ్యామి = చూడజాలకున్నాను

తాత్పర్యం :-

ఓ కేశవా! పెక్కు అపశకునములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజనసమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు.

కొన్ని కార్యముల భావిపరిణామములను శకునములు సూచించుచుండును. ఈ శోకమున ‘నిమిత్తాని’ అను పదము వీటిని తెల్పుటకే చెప్పబడినది. అర్జునుడు అపశకునములు కనబడుచున్నవని తెలుపుచు – ‘వేళగానివేళ గ్రహణము పట్టుట, భూమి కంపించుట, ఆకాశమునుండి నక్షత్రములు రాలిపడుట మొదలగు అపశకునములచే ఈ యుద్ధపరిణామము అంత మంచిది కాబోదని వ్యక్తమగుచున్నదనియు, యుద్ధము చేయకుండుటయే శ్రేయస్కరము’ అనియు తన భావమును ప్రకటించెను.

సర్వజనులను, బాంధవులను యుద్ధము నందు సంహరించుట వలన ఏ విధముగను హితము చేకూరదు. ఏలనన, ఆత్మీయులగు స్వజనులను సంహరించుటచే చిత్తమున పశ్చాత్తాపజనితమగు క్షోభ కలుగును. వారులేని జీవితము దుర్భరమై, దుఃఖమయమగును. వారిని చంపుటచే మహాపాపము కలుగును. ఈ దృష్టితో చూచినప్పుడు ఇహమున గాని, పరమునగాని జరుగుమేలు ఏమియును లేదు. అందువలన యుద్ధమొనరించుట ఏ విధముగను ఉచితముకాదని అర్జునుని మాటల ఆంతర్యము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top