భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము – ఇరవై ఎనిమిది, ఇరవై తొమ్మిదవ శ్లోకము

అర్జున ఉవాచ
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ।
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ।
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ॥

కృష్ణ! = ఓ కృష్ణా!
సముపస్థితమ్ = (సమరభూమికి) చేరియున్న
యుయుత్సుమ్ = యుద్ధాభిలాషతోనున్న
ఇమమ్ స్వజనమ్ = ఈ స్వజన సముదాయమును
దృష్ట్వా = చూచి
మమ = నా యొక్క
గాత్రాణి = అంగములు
సీదంతి = పట్టుతప్పుచున్నవి
చ = మరియు
ముఖమ్ = నోరు
పరిశుష్యతి = ఎండిపోవుచున్నది
చ = ఇంకను
మే = నాయొక్క
శరీరే = శరీరమునందు
వేపథుః = కంపము
రోమహర్షః చ = గగుర్పాటు గూడ
జయతే = కలుగుచున్నది

తాత్పర్యం :-

అర్జునుడు పలికెను – ఓ కృష్ణా! సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును జూచి, నా అవయవములు శిథిలములగుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది. శరీరమునందు వణుకు, గగుర్పాటు కలుగుచున్నవి.

ఈ మహాయుద్ధపరిణామము అతిభయంకరముగా నుండును. ఇప్పుడు నా కంట్టెదుట నిలిచియున్న ఈ పిన్నలు, పెద్దలు, బంధువులు, ఆత్మీయులు, సర్వజనులు అందరును మృత్యువునకు ఆహుతి అయ్యెడువారేకదా! అను ఈ విషయమును తలచినంతనే నాకు తట్టుకొనలేని వేదన కలుగుచున్నది. నా హృదయాంతరాళమున అంతులేని భయము ఉప్పతిల్లినది. అందువలన నా దేహమునకు ఇంతటి దురవస్థ కలుగుచున్నది. అని అర్జునుడు పలికెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top