భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - పదనాలుగవ శ్లోకము

తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ ।
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ॥

తతః = పిదప
శ్వేతైః = తెల్లని
హయైః = గుఱ్ఱములతో
యుక్తే = కూడియున్న
మహతి = ఉత్తమమైన
స్యందనే = రథమునందు
స్థితౌ = కూర్చొనియున్న
మాధవః, చ = శ్రీకృష్ణపరమాత్ముడును
పాండవః, ఏవ = పాండుకుమారుడైన అర్జునుడును
దివ్యౌ = దివ్యము (అలౌకికము) లైన
శంఖౌ = శంఖములను
ప్రదధ్మతుః = పూరించిరి

తాత్పర్యం :-

తదనంతరము శ్వేతాశ్వములను పూన్చిన మహారథముపై ఆసీనులైయున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశంఖములను పూరించిరి.

అర్జునుని రథము బహువిశాలమైనది, దివ్యమైనది. అది సువర్ణఖచితమై తేజోవంతమైనది. మిక్కిలి దృఢమై, కడుసుందరమైనది. చిరుమువ్వలు కట్టబడిన అనేకపతాకములు దానిపైన రెపరెపలాడుచుండెను. గొప్ప దృఢమైన, విశాలములకు చక్రములను కలిగియుండెను. చంద్రతారకల చిహ్నములను కలిగిన ఎత్తైన ధ్వజము సౌదామినీ సన్నిభముగా కాంతులను విరజిమ్ముచుండెను. దానిపై హనుమంతుడు విరాజమానుడై యుండెను. ఆ ధ్వజమును గూర్చి పూర్వము సంజయుడు, దుర్యోధనునితో ఇట్లు వివరించియుండెను. ‘ఆ ధ్వజము అన్నివైపుల యోజనపర్యంతము అటునిటు ఆవరించి రెపరెపలాడుచుండును. అంబరమునందు ప్రకాశవంతమైన ఇంద్రధనుస్సువలె ఆ ధ్వజము విచిత్రవర్ణములతో గోచరించుచుండును. ఇంతటి విశాలముగ వ్యాపించియున్ననూ, అది భారమైనది కాదు, ఎచ్చటను ఆగదు, చిక్కుకొనదు. చెట్ల గుంపుల మధ్య నుండి అది నిరాటంకముగా పయనింపగలదు. దానిని చెట్లు తాకనైనను తాకజాలవు.’

అట్టి దివ్యరథమునకు దివ్యములకు నాలుగు తెల్లని గుఱ్ఱములు పూన్చబడినవి. అవి మనోహరములైనవి, సుసజ్జితములైనవి, సుశిక్షితములైనవి, బలీయములైనవి. అత్యంత వేగముగా పరుగెత్తునవి. అవి గంధర్వరాజగు చిత్రరథుడు అర్జునునకు బహుమతిగా నొసంగిన నూరు గుఱ్ఱములలోనివి. ఇందెన్ని చంపబడినప్పటికినీ వాటి సంఖ్యలో నూరింటికి నూరు సిద్ధమై యుండును. తగ్గుచుండేడివికావు. ఈ గొప్పతనము రథమునకు కూడా ఉండెను. పూర్వము ఖాండవవనము దహించువేళ అగ్నిదేవుడు ప్రసన్నుడై ఈ దివ్యమహా రథమును అర్జునునకు ప్రసాదించెను. శ్రీకృష్ణభగవానుడు, వీరవరుడగు అర్జునుడును దీనిని అలంకరించి యుండిరి. భీష్మ పితామహుడును ఇతర కౌరవయోధులును మ్రోగించిన శంఖములు మొదలగు రణవాద్యముల ధ్వనులను వారు వినిరి. వారు కూడా యుద్ధారంభమును ప్రకటించుచు తమ శంఖములను పూరించిరి. శ్రీకృష్ణార్జునులు పూరించిన ఈ శంఖములు సామాన్యమైనవి కావు, అవి అత్యంత విలక్షణములై, తేజోవంతములై, అలౌకికములైనవి. అందుచే అవి దివ్యమైనవని పేర్కొనబడినవి.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top