భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము – ముప్పది రెండవ శ్లోకము

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ।
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ॥

కృష్ణ! = ఓ కృష్ణా!
విజయమ్ = విజయమును
న కాంక్షే = (నేను) కోరుటలేదు (కోరను)
చ రాజ్యమ్ = మరియు రాజ్యమును
న = సైతము (కోరను)
సుఖాని చ (న) = సుఖములనుగూడ (కోరను)
నః = మాకు
రాజ్యేన = (అట్టి) రాజ్యముతో
గోవింద! = ఓ కృష్ణా!
కిమ్ = ఏమి ప్రయోజనము
వా = అథవా (లేక)
భోగైః = భోగములతో(గాని)
జీవితేన = జీవితముతో(గాని)
కిమ్ = ఏమిలాభము?

తాత్పర్యం :-

ఓ కృష్ణా! నాకు విజయము గాని, రాజ్యము గాని, సుఖములు గాని అక్కరయే లేదు. గోవిందా! ఈ రాజ్యమువలనగాని, ఈ భోగములవలన గాని, ఈ జీవితమువలన గాని ప్రయోజనమేమి?

అర్జునుడు తన మానసికస్థితిని చిత్రీకరించుచు ‘ఓ కృష్ణా! ఆత్మీయులగు నా స్వజనులను సంహరించినపిదప లభింపనున్న విజయమును గాని, రాజ్యమునుగాని, సుఖమును గాని నేనెంతమాత్రమును కోరుకొనుట లేదు. వీరందరిని వధించిన మీదట ఇహలోకమునందుగాని, పరలోకమునందుగాని నాకు మిగిలేది పరితాపమేయని స్పష్టమగుచున్నది. అప్పుడిక యుద్ధము జేయుటేల? వీరిని వధించుటేల? ఇటువంటి రాజ్య భోగములతో లభించునదేమి? వీరినందరిని సంహరించి జీవించుటవలన కూడా పొందులాభమేమియును లేదని’ నా బుద్ధికి తోచుచున్నది.’ అనునదియే అర్జునుని మాటల అంతరార్థము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top