భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము – ముప్పది మూడవ శ్లోకము

యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ ।
త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ॥

యేషామ్ అర్థే = ఎవరికొరకైతే
రాజ్యమ్ = రాజ్యము
భోగాః = భోగములు
సుఖాని చ = సుఖములును
నః = మాకు
కాంక్షితమ్ = అభీష్టమూ, (అభీష్టములో)
తే = వారును
ఇమే = వీరును (అందరును)
ధనాని = సంపదలపైనను
ప్రాణాన్ = ప్రాణములపైనను
త్యక్త్వా = (ఆశలను) వదలుకొని
యుద్ధే = యుద్ధమునందు
అవస్థితా = నిలిచి (సన్నద్ధులై) యున్నారు
చ = మరియు

తాత్పర్యం :-

మనము ఎవరికై ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుకొనుచున్నామో, వారే ధనప్రాణముల యెడ ఆశలు వదలుకొని యుద్ధమునకు సన్నద్ధులై వచ్చియున్నారు.

నాకు ఈ రాజ్యము, సుఖభోగముల అవసరము ఏమాత్రమూ లేనేలేదు. ఏలనన, ఇవి అనిత్యములేగాక, వీటివలన శాశ్వతమైన ఆనందము కూడా కలుగదని నేను ఎరుగుదును. నా ఈ సోదరులు, బంధువులు మొదలగు సర్వజనులకొరకే నేను రాజ్యాదులను కోరుచుంటివి. కాని వీరందరును యుద్ధమున తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధముగా నిలిచియున్నట్లు తోచుచున్నది. ఒకవేళ వీరందరును రణరంగమున మృత్యువాత పడినచో, ఈ రాజ్యము, సుఖములు, భోగములు ఎందులకు? అందుచే ఏవిధముగ జూచినను పోరుసల్పుట ఉచితము కాదు.’ అని అర్జునుడు ఇచట తన అభిప్రాయమును వెల్లడించుచున్నాడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top