భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము – ముప్పది ఐదవ శ్లోకము

ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోఽపి మధుసూదన ।
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ॥

మధుసూదన! = ఓ మధుసూదనా!
ఘ్నతః అపి = (నేను) చంపబడినను
త్రైలోక్యరాజ్యస్య = (లేక) మూడులోకముల రాజ్యాధిపత్యము
హేతోః అపి = నిమిత్తమైనను
ఏతాన్ = వీరిని (ఈ సర్వజనులను)
హంతుమ్ = చంపుటకు
న ఇచ్చామి = ఇష్టపడను
మహీకృతే = భూమండలము కొరకైతే
కిమ్ ను = చెప్పవలసినదేమి?

తాత్పర్యం :-

ఓ మధుసూదనా! ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండలవిషయమై చెప్పనేల? అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చంపబూనిననూ నేను మాత్రము వారిని చంపనే చంపను.

ఇందులకే అర్జునుడు ‘ఘ్నతః’, ‘అపి’ అను పదములను ప్రయోగించెను. ‘నా పక్షమువారు నన్ను చంపుదురను ప్రశ్నయే ఉదయింపదు. విపక్షమున గల బంధువులు సైతము నేను యుద్దమును విరమించినప్పుడు కూడా బహుశా నన్నుసంహరించుటకు ఇష్టపడరు. ఏలనన వారు రాజ్యలోభముచే పోరు సల్పుటకు తలపడియుంటిరి. మేము యుద్ధనివృత్తులమై రాజ్యకాంక్షను వీడినప్పుడు ఇక మమ్ము సంహరించుటకు వారికి ఎట్టి కారణము మిగిలి యుండదు. కానీ ఇంతలో ఒకవేళ ఎవరైనను చంపదలచినచో, అట్లు నన్ను వధించుటకు ప్రయత్నించువారిని కూడా నేను సంహరింపను అని అతని అభిప్రాయము.

ధారుణి యందలి రాజ్యము, సుఖభోగముల మాట యేల? వీరిని సంహరించుట వలన నిష్కంటకమగు త్రైలోక్య రాజ్యము లభించినను ఆచార్యులను, ఆత్మీయులను, సర్వజనులను చంపుటకు నేను ఇష్టపడను అని అర్జునుని భావము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top