భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - ఇరవైయవ శ్లోకము

అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ।
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ।
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే ॥

అథ = తరువాత
వ్యవస్థితాన్ = నిలిచియున్న
దృష్ట్వా = చూచి
ధార్తరాష్ట్రాన్ = ధృతరాష్ట్ర కుమారులను
కపిధ్వజః = హనుమానుని చిహ్నముతోనున్న ధ్వజము గల అర్జునుడు
ప్రవృత్తే = ఆరంభింపబోవుచు
శస్త్రసమ్పాతే = బాణములను విసురుటను
ధనుః = ధనస్సును
ఉద్యమ్య = చేపట్టి
పాణ్డవః = పాండురాజు కుమారుడైన అర్జునుడు
హృషీకేశం = శ్రీకృష్ణభగవానునితో
తదా = అప్పుడు
వాక్యం = వాక్యమును
ఇదం = ఈ
ఆహ = పలికెను
మహీపతే = ఓ రాజా

తాత్పర్యం :-

ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు నిలిచి, ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడెను. ఓ రాజా! వ్యూహముగా నిలిచియున్న ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణభగవానునితో ఈ వాక్యములను పలికెను.

యుద్ధము కొద్ది సమయములో ఆరంభము కానుండెను. యుద్ధ రంగమున శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్షోపదేశములచే నిర్దేశితులైన పాండవులచే ఏర్పాటు చేయబడిన అనూహ్యమైన సేనావ్యూహము ధృతరాష్ట్రతనయులను దాదాపు పూర్తిగా నిరుత్సాహపరచినదని పై వాక్యము ద్వారా అవగతమగుచున్నది. హనుమానుని రూపముచే చిహ్నితమైన అర్జునుని ధ్వజము విజయమునకు మరొక సూచనయై యుండెను. ఏలయన, రామ, రావణుల నడుమ జరిగిన యుద్ధములో హనుమంతుడు రామునకు సహాయము చేయగా శ్రీరాముడు విజయము నొందెను. ఇప్పుడు రాముడు మరియు హనుమానులిరువురును అర్జునునికి సహాయము చేయుటకై అతని రథమున ఉండిరి. శ్రీకృష్ణభగవానుడు స్వయముగా శ్రీరాముడే. అంతియేగాక శ్రీరాముడు ఎచ్చట నుండునో ఆతని నిత్య సేవకుడైన హనుమానుడు మరియు నిత్యసతియైన సీతాదేవి అచ్చట నుందురు. కావున వాస్తవమునకు అర్జునునకు ఎట్టి శత్రువు నుండియు భయము నొందుటకు కారణము లేదు. అన్నింటికి మించి హృషీకేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనము చేయుటకు స్వయముగా ఉపస్థితుడై యుండెను. ఈ విధముగా యుద్ధము నిర్వహించుట యనెడి విషయమున చక్కని సహాయము అర్జునునకు లభ్యమై యుండెను. తన నిత్యభక్తుని కొరకు భగవానుడు ఏర్పరచిన అట్టి శుభకరమైన పరిస్థితులు నిశ్చయమగు విజయమునకు సూచనలు కావించుచున్నవి.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top