భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - పదవ శ్లోకము

అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ ।
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ॥

భీష్మాభిరక్షితమ్ = భీష్మపితామహునిచే రక్షితమైన
అస్మాకమ్ = మనయొక్క
తత్ బలమ్ = ఆ సేన
అపర్యాప్తమ్ = అపరిమితమైనది (అజేయమైనది)
తు, భీమాభిరక్షితమ్ = అయితే భీమునిచే రక్షింపబడిన
ఏతేషామ్ = వీరియొక్క
ఇదమ్ బలమ్ = ఈ సైన్యము
పర్యాప్తమ్ = పరిమితమైనది (జయించుటకు సులభమైనది)

తాత్పర్యం :-

భీష్మపితామహునిచే సురక్షితమై, అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము.

కౌరవుల సేనలు 11 అక్షౌహిణీలు. పాండవుల సేనలు 7 అక్షౌహిణీలు. అంటే దాదాపు కౌరవుల సేనలు పాండవుల సేనల కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ. ఆ మాత్రానికే దుర్యోధనుడు తనకు అపార సేనావాహిని కలదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు. అదీ కాకుండా మన సైన్యాధ్యక్షుడు భీష్ముడు. అది కూడా ఒక అనుకూల అంశము అని ధైర్యము. అంతలోనే అధైర్యపడుతున్నాడు దుర్యోధనుడు. పాండవ సేనలు భీమునిచే రక్షింపబడుతున్నాయి అని అన్నాడు. పాండవ సేనానాయకుడు ధృష్టద్యుమ్నుడు. భీముడు ఒక మహారథి. కాని భీముని గురించిన, ఆ భీముని బలాపరాక్రమాల గురించిన గుబులు దుర్యోధనుడికి మనసులో తొలుస్తూనే ఉంది. తన తొడలు విరగగొడతాననీ, దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతాననీ, గాంధారేయులను నూర్గురను తానే చంపుతాననీ భీముడు నిండు సభలో చేసిన శపథం దుర్యోధనుడికి గుర్తుకొస్తూ ఉంది. అందుకే పాండవ సేనలు భీమునిచేత రక్షింపబడుతున్నాయి అని కాస్తంత అధైర్యపడ్డా, అయినా పర్వాలేదు మనకు భీష్ముడు ఉన్నాడు కదా అని తనకు తాను సర్దిచెప్పికున్నాడు. అదీకాకుండా పాండవులు మొదటి రోజు వజ్రవ్యూహమును పన్నారు. ఆ వజ్రవ్యూహమునకు నాయకుడు భీముడు. అందుకే భీముడు వ్యూహము మొదట్లో నిలబడి ఉన్నాడు. భీముడు విజృంభిస్తే యుద్ధము మొదటి రోజే సమాప్తం కాదుకదా అనే శంక కూడా దుర్యోధనుని మనసులో ఏదో ఒకమూల బాధిస్తూ ఉన్నట్టుంది. అందుకే ఇక్కడ భీముని ప్రస్తావన తెచ్చాడు దుర్యోధనుడు.

ఈ శ్లోకాన్ని మరింత వివరంగా అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేద్దాము. తమకు ధనుర్విద్యను నేర్పని గురువుగారు ద్రోణాచార్యుల వారితో ఇలా అంటున్నాడు దుర్యోధనుడు. “ఆచార్యా! భీష్ములు వారి రక్షణలో ఉన్న సైన్యం గొప్పదే కాని భీముని చేత రక్షింపబడుతున్న పాండవుల సైన్యం ముందు చాలదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ధర్మం, ధర్మానికి ప్రతిరూపము అయిన శ్రీకృష్ణుడు వారి పక్షాన ఉన్నాడు. మనం గెలుస్తామంటారా!” అనే సందేహం వెలిబుచ్చాడు. అంటే దుర్యోధనుడి లోలోపల ఉన్న మనస్థైర్యము దెబ్బతిన్నది అని అర్థం. ఈనాడు కూడా ధనము, ఆస్తులు, పదవులు, చుట్టు జనం ఉన్నా, చాలామందికి మానసిక స్థైర్యము ఉండదు. తాను చేసిన, చేస్తున్న అక్రమాలకు, అన్యాయాలకు, అధర్మాలకు ఒళ్ళు మండి, ఎవడొచ్చి చంపుతాడో అని తమ చుట్టూ గన్మెన్లనుపెట్టుకొని తిరుగుతుంటారు కొందరు. ధర్మం తమ పక్షానుంటే ఎటువంటి అంగబలం అర్థబలం అక్కరలేదు. ధర్మబలం లేని నాడు, ఎంత అర్థబలం, అంగ బలం ఉన్నా వృధా. అంటే అంగబలం, అర్థబలం కన్నా ధర్మబలం గొప్పది. ధర్మం ఎవరి పక్షాన ఉంటుందో వారికే విజయం లభిస్తుంది అన్న మూలసూత్రం దుర్యోధనుడి మనసులో ఏదో ఒక మూల తలెత్తి, ఒక విధమైన అపనమ్మకం కలిగిస్తూ ఉంది. అందుకే ఈ మాటలు అన్నాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. అంతలోనే తేరుకొని కర్తవ్యమును గురువుగారికి వివరించాడు దుర్యోధనుడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top