భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - పదిహేనవ శ్లోకము

పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః ।
ప్రౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ॥

హృషీకేశః = శ్రీకృష్ణుడు
పాంచజన్యమ్ = పాంచజన్యమను పేరుగల శంఖమును (పూరించెను)
ధనంజయః = అర్జునుడు
దేవదత్తమ్ = దేవదత్తమను పేరుగల శంఖమును (పూరించెను)
భీమకర్మా = భయంకర కృత్యములను చేయునట్టి
వృకోదరః = భీమసేనుడు
పౌండ్రమ్ = పౌండ్రమను పేరుగల
మహా శంఖమ్ = మహాశంఖమును
దధ్మౌ = పూరించెను

తాత్పర్యం :-

శ్రీకృష్ణుడు ‘పాంచజన్యము’ అను శంఖమును, అర్జునుడు ‘దేవదత్తము’ అను శంఖమును పూరించిరి. అరివీరభయంకరమైన భీముడు ‘పౌండ్రము’ అను మహాశంఖమును పూరించెను.

‘హృషీక’ములనగా ఇంద్రియములు. ‘ఈశు’డనగా అధిపతి, స్వామి. ఇంద్రియములకు అధిపతిని ‘హృషీకేశు’డని అందురు.అంతియేగాక హర్ష, సుఖ, సౌఖ్యయుతమైన ఐశ్వర్య నిధానమును ‘హృషీకేశ’మని యందురు. భగవానుడు ఇంద్రియములకు అధీశ్వరుడు మరియు హర్ష, సుఖ, పరమైశ్వర్యములకు నిధానమైనవాడు కూడా అగుటచే అతనికి ‘హృషీకేశు’డను పేరు ఏర్పడెను. పంచజనుడును పేరుగల శంఖరూపధారియగు దైత్యుని సంహరించి భగవానుడు అతని శంఖమును స్వీకరించెను. అందుచే ఆ శంఖమునకు ‘పంచజన్యము’ అను పేరు కలిగినది.

రాజసూయాధ్వర సమయమున అర్జునుడు పెక్కుమంది రాజులను జయించి అపార ధనమును తెచ్చియుండెను. ఆకారణమున అతనికి ధనంజయుడను పేరు కలిగినది. పూర్వము అర్జునుడు నివాతకవచాది దైత్యులతో పోరువేళ ఇంద్రుడు అతనికి ‘దేవదత్తము’ అను శంఖమును ప్రసాదించెను. ఈ శంఖధ్వని అతి భయంకరమైనది. ఆ ధ్వనిని వినిన శత్రుసైన్యములు భయముతో గడగడలాడెడివి.

భీమషేనుడు అతి బలశాలి. అతని పనులు చూచిన వారికినీ, వినిన వారికినీ మనస్సునందు అత్యంత భయోత్పాతము కలుగుచుండెడిది. అందుచే ఆతడు ‘భీమకర్మా’ అనబడెను. అతని భోజనపరిమాణము మిక్కిలి ఎక్కువగా నుండుట చేతను, దానిని జీర్ణించుకొను శక్తిమంతుడగుటచేతను, అతడు ‘వృకోదరుడ’ను నామముతో వ్యవహరింపబడెను. ఈతని ప్రౌండ్రనామ శంఖము కూడా గొప్ప ఆకారమును గలిగి, చాలా భయంకర శబ్దమును చేయునదగుటచే అది ‘మహాశంఖం’ అని పిలువబడెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top