భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - ఏడవ శ్లోకము

అస్మాకం తు విశిష్టా ఏ తాన్నిబోధ ద్విజోత్తమ ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ॥

ద్విజోత్తమ = ఓ బ్రాహ్మణోత్తమా!
అస్మాకమ్ తు = మనపక్షమువారైతే
యే = ఎవరు
విశిష్టాః (సంతి) = ప్రముఖులై ఉన్నారో
తాన్ = వారినిగూర్చి
నిబోధ = తెలిసికొనుడు
తే = మీయొక్క
సంజ్ఞార్థమ్ = ఎరుకకొరకు
యే = ఎవరయితే
మమ = నా (యొక్క)
సైన్యస్య = సేనకు
నాయకాః = నాయకులై యున్నారో
తాన్ = వారిని
బ్రవీమి = తెలిపెదను

తాత్పర్యం :-

ఓ బ్రాహ్మణోత్తమా! మన పక్షముననున్న ప్రధానయోధులను గూడ గమనింపుము. మీ ఎరుకకై మన సేనానాయకులను గూర్చియు తెలుపుచున్నాను.

ఈ శ్లోకంలో ద్విజోత్తమ అని గురువుగారు ద్రోణాచార్యుని సంబోధించాడు దుర్యోధనుడు. ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్తమా! అని అర్థం. బ్రాహ్మణుడు గురువుగా తన శిష్యులకు సమస్త విద్యలు నేర్పవచ్చు. విద్య అంటే ధనుర్విద్య, యుద్ధవిద్య కూడా వస్తాయి. కాబట్టి యుద్ధవిద్యలు బ్రాహ్మణుడు నేర్పవచ్చు కానీ యుద్ధం చేయకూడదు. ఎందుకంటే యుద్ధం హింసతో కూడుకున్నది. బ్రాహ్మణుడికి హింస చేయడం ధర్మం కాదు. అందుకని వ్యాసులవారు ఎత్తిపొడుపుగా ఈ పదం వాడి ఉండవచ్చు. కాని దుర్యోధనుడికి ఆ భావన ఉన్నట్టు కనిపించదు.

తన సేనలోని అందరికంటే గొప్పవారైన వీరులు, ధీరులు, బలశాలురు, బుద్ధిమంతులు, సాహసవంతులు, పరాక్రమశీలురు, తేజశ్శాలురు, శస్త్రవిద్యా విశారదులగు వారిని ఉద్దేశించి దుర్యోధనుడు ఇచట ‘విశిష్టాః’ అను పదమును ప్రయోగించెను. ఇక ‘నిబోధ’ అను క్రియోపదముతో – ‘తమ సైన్యమునందు కూడా ఇట్టి సర్వోత్తమ శూరవీరులకు కొదవలేదు. నేను అందులో లెక్కింపదగిన కొందరి వీరుల పేర్లను ప్రత్యేకముగా మీకు తెల్పుదును. ఇక వినుడు’, అని సూచించెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top