భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - పదమూడవ శ్లోకము

తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః ।
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ॥

తతః = పిమ్మట
శంఖాః చ = శంఖములును
భేర్యః చ = నగారాలును
పణవానక గోముఖాః = డోళ్లు, మృదంగములు, కొమ్మువాద్యములు మొదలగునవి
సహసా, ఏవ = ఒక్కుమ్మడిగా
అభ్యహన్యంత = మ్రోగినవి
సః, శబ్దః = ఆ శబ్దము
తుములః = మిక్కిలి భయంకరమైనదిగా
అభవత్ = ఆయెను

తాత్పర్యం :-

మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖవాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి.

భీష్మపితామహుడు సింహ సదృశముగ గర్జించి, శంఖము నూది యుద్ధారంభమును ప్రకటించిన వెంటనే అన్ని వైపుల ఉత్సాహము ఉప్పొంగినది. సమస్త సేనలో అన్ని దిశల నుండి విభిన్న సేనా నాయకుల శంఖములు, వివిధములగు యుద్ధ వాద్యములు మ్రోగినవి. అవన్నియూ ఒక్కసారిగా మ్రోగుటచే వెలువడిన ఆ భయానక శబ్దముతో ఆకాశమంతయు ప్రతిధ్వనించెను.

‘యుద్ధమునకై ఒకచోట గూడిన నావారు, పాండునందనులు ఏమిచేసిరి?’ అను ధృతరాష్ట్రుని ప్రశ్నకు ప్రత్యుత్తరముగా సంజయుడు ఇంతవరకు కౌరవపక్షమునందలి వారిని గూర్చి చెప్పెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top